గర్భం ధరించాక శారీరక మార్పులు, బిడ్డ పుట్టాక బరువు పెరగడం.. వంటివి ప్రతి మహిళలో సహజం. అయితే చాలామంది మహిళలు ఈ మార్పుల్ని అంగీకరించరు.. త్వరగా బరువు తగ్గి పూర్వపు స్థితిలోకి రావాలని ఆరాటపడుతుంటారు. కానీ తనకు మాత్రం పెరిగిన బరువు తగ్గే విషయంలో తొందరేమీ లేదంటోంది బాలీవుడ్ లవ్లీ మామ్ సోనమ్ కపూర్. 2018లో తన ఇష్టసఖుడు ఆనంద్ అహుజాను పెళ్లాడింది సొగసుల సోనమ్. గతేడాది ఆగస్టులో కొడుక్కి జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రసవానంతరం పెరిగిన బరువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడట్లేదంటోంది.
ఈ క్రమంలో నోరు కట్టేసుకోకుండా.. చనుబాలు ఉత్పత్తయ్యేందుకు తోడ్పడే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే ఓ సందర్భంలో ముచ్చటించిన ఆమె.. ప్రసవానంతరం తనకెదురైన అనుభవాల్ని, పెరిగిన బరువు విషయంలో తాను పాటిస్తోన్న నియమాల్ని పంచుకుంది. ‘తల్లయ్యాక చాలామంది మహిళలు పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఆరాటపడతారు. ఈ క్రమంలో త్వరితగతిన తగ్గేయాలని క్రాష్ డైట్స్ పాటించే వారూ లేకపోలేదు. అయితే నేను మాత్రం ఇంత అత్యవసరంగా బరువు తగ్గాలనుకోవట్లేదు. ఈమధ్య కాలంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూసి ‘నిజంగా నేనింతలా మారిపోయానా?’ అని అస్సలు ఫీలవ్వట్లేదు.
బరువు పెరిగి, వయసు మీద పడినట్లుగా కనిపిస్తున్నానని భయపడట్లేదు. నేను ఇంతకుముందులా లేనన్న బెంగ లేదు. తల్లినయ్యాక కొన్ని నెలల తర్వాత తిరిగి షూటింగ్స్లో పాల్గొనడం మొదలుపెట్టా. ఈ క్రమంలో ధరించబోయే కాస్ట్యూమ్స్క సంబంధించిన కొలతలు ముందుగానే ఇచ్చి మరీ దుస్తులు కుట్టించుకుంటున్నా. అంతేకానీ.. గతంలో ధరించిన దుస్తులు పట్టట్లేదని బాధపడట్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సర్వసాధారణం. వాటిని అంగీకరించకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకునే మొండి ప్రవర్తన మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
అందుకే ప్రతిదీ సానుకూలంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ అందాల అమ్మ. ‘కొంతమంది ప్రెగ్నెన్సీని అనారోగ్యంగా భావిస్తుంటారు. కాలు తీసి కాలు పెట్టలేనంత అతి సుకుమారంగా మారిపోతారు. అయితే ఈ సమయంలో మనం ఎంత చురుగ్గా ఉంటే ప్రసవం అంత సులభంగా అవుతుంది. ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ! వాయు కడుపులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ గాఉండేదాన్ని. పోషకాహారం తీసుకునేదాన్ని.. వ్యాయామాలు చేసేదాన్ని.
సుఖ ప్రసవం ద్వారానే బిడ్డను ప్రసవించాలని ముందు నుంచే బలంగా కోరుకున్నా. ఇందులో భాగంగానే ‘జెంటిల్ బర్త్ మెథడ్’ సహాయం తీసుకున్నా. గర్భిణిగా ఉన్న సమయంలో సమస్యలు రాకుండా చేసి.. శరీరాన్ని, మనసును ప్రసవానికి సిద్ధం చేసే ప్రక్రియ ఇది. దీని ద్వారా తల్లిలో చనుబాలు త్వరగా ఉత్పత్తవడంతో పాటు పాలిచ్చే ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ సొగసరి.