కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “స్పైడర్” మూవీ ఈనెల 27 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ మూవీకి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఆయన స్వరపరిచిన పాటలను నేడు చెన్నైలో ఆవిష్కరించారు. అవి ఎలా ఉన్నాయంటే?
బూమ్ బూమ్ సినిమాల్లో మహేష్ బాబు ఎంట్రీ ఫ్యాన్స్ కిక్ ఇస్తుంది. అలాగే ఎంట్రీ సాంగ్. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని బూమ్ బూమ్ పాటని హరీష్ జయరాజ్ పబ్ బీట్ తో కంపోజ్ చేశారు. “కుట్ర గిట్ర పుట్టేలోపున ఇట్టే కాదా అంతమే, గాల్లో కన్నై గస్తీ కాసే గూడాచారి వీడులే..” అంటూ రామ జోగయ్య శాస్త్రి స్పైడర్ గురించి వివరించడం మొదలెట్టారు. చట్టం షర్ట్ నలిగి పోతే చేసేస్తాడు ఇస్త్రీ.. వీడిని అనుమతి అడగందే.. క్రిములు వ్యాపించవు అసలే” అని స్పై గురించి ఐదు నిముషాల్లో చెప్పారు. నిఖిత గాంధీ ఈ పాటను చాలా జోష్ గా పడి ఆల్బమ్ ని ఉత్సాహంగా ప్రారంభించారు.
సిసిలియా సిసిలియా క్యూట్ డ్యూయట్ సాంగ్ “సిసిలియా సిసిలియా”. కొత్త ట్యూన్ తో హరీష్ జయరాజ్ విభిన్నంగా కంపోజ్ చేశారు హరిచరణ్, శక్తి శ్రీ లు కూడా చాలా ముద్దుగా ఆలపించారు. సాహిత్యంలో “పరువాల ఆకుపచ్చ ఆక్రమించా.. పగిలా నవ్వు విసిరేస్తే” అనే కొత్త పదాలను రామ జోగయ్య శాస్త్రి ప్రయోగించి ఆకట్టుకున్నారు.
హాలీ హాలీ ఉత్తర ప్రదేశ్ సింగర్ బ్రిజేష్ త్రిపాఠి శాండిల్య, యువ గాయణిలు హరిణి & జోగి సునీత లు హుషారుగా పడిన పాట హాలీ హాలీ. వెస్ట్రన్ కి కొంచెం అరబిక్, కొంచెం పంజాబీ ఫ్లేవర్ మిక్స్ చేసి హరీష్ జయరాజ్ మ్యూజిక్ తో రొమాన్స్ చేయించారు. రొమాంటిక్ సాంగ్ ని అంతే చిలిపిగా శాస్త్రి రాసారు. “నేను మెచ్చుకున్నా మెచ్చుకున్నా సోకులిచ్చి నాగుండె కొచ్చి గుచ్చుకోవే” “దిమాక్ ఇది దిండు మీద పడుకోదు..నిదురేపోదూ ” అబ్బాయిలోని వేదనను వివరించగా.. “సందేళ్లకు సక్కనోడు ఎక్కడంది పెరిగే ముద్దు” “చల్లా చల్లా పుల్ల ఐస్ వయసిది.. తెల్ల తెల్ల బెల్లమంటి సొగసిది” అంటూ అమ్మాయి సిగ్గుపడుతోంది. ఇది వినడానికే కాదు చూసేందుకు కూడా నంబర్ వన్ సాంగ్ అవుతుంది.
అచ్చమ్ తెలుగందంఅచ్చమ్ తెలుగందం పాటని ర్యాప్ బీట్ తో ప్రారంభించారు. అక్కడక్కడా క్లాసికల్ మ్యూజిక్ టచ్ ఇస్తూ జయరాజ్ కొత్త ఫీల్ రప్పించారు. ఈ సాంగ్ వెస్ట్రన్ మ్యూజిక్ ఇస్టపడేవారికి బాగా నచ్చుతుంది. ప్రవీణ్, స్టాన్లీ, సత్య ప్రకాష్ ముగ్గురు పాడినప్పటికీ మాస్ ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే. లిరిక్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది.
స్పైడర్ ఆన్ మిషన్ హరీష్ జయరాజ్ క్లైమాక్స్ కోసం స్వరపరిచిన థీమ్ సాంగ్ ఇది.
మురుగదాస్ గత చిత్రాల మాదిరిగానే సినిమా థీమ్ కి అనుగుణంగానే పాటలు ఉన్నాయి. ఆల్బమ్ లో ఐదు సాంగ్స్ ఉన్నప్పటికీ నాలుగు మాత్రమే సాహిత్యంతో కూడిన పాటలు. వీటిలో సంగీతం, సాహిత్యం పరంగా హాలీ హాలీ పాట మొదటి స్థానాన్ని దక్కించుంది. ఇక మిగిలిన మూడు పాటలు సినిమా చూసిన తర్వాత గుర్తుండేందుకు ఆస్కారం ఉంది. మొత్తానికి హరీష్ జయరాజ్ స్టైలిష్ ఆల్బం మాత్రమే ఇచ్చారు.