జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “శ్రీదేవి శోభన్ బాబు”. తమిళనాట సంచలన విజయం సాధించిన “96” చిత్రంతో కుర్రకారును విశేషంగా అలరించిన గౌరి జి.కిషన్ ఈ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. మరి ఈ రూరల్ డ్రామాతోనైనా సంతోష్ శోభన్ హిట్ కొట్టగలిగాడో లేదో చూద్దాం..!!
కథ: హైద్రాబాద్ లో ఫ్యాషన్ డిజైనర్ గా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది శ్రీదేవి (గౌరి కిషన్). చూడ్డానికి స్మార్ట్ గా ఉన్నా.. అమ్మాయి మాత్రం నాటు. అలాంటి శ్రీదేవికి, తన తండ్రి (నాగబాబు)ని తన మేనత్త (రోహిణి) అవమానించిందని, ఆ అవమానాన్ని తండ్రి ఇప్పటికీ దిగమింగుకోలేకపోతున్నాడని తెలుసుకొని..
తన మేనత్తకు తగిన బుద్ధి చెప్పడానికి అరకు బయలుదేరుతుంది. అక్కడ పరిచయమవుతాడు శోభన్ బాబు (సంతోష్ శోభన్). శోభన్ బాబుని కలిసిన శ్రీదేవికి ఏమైంది? తన పగ తీర్చుకోగలిగిందా? అనేది “శ్రీదేవి శోభన్ బాబు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట.
నటీనటుల పనితీరు: నటుడిగా సంతోష్ శోభన్ కు ఎలాంటి వంకలు పెట్టలేము. ఎలాంటి ఎమోషన్స్ అయినా ఎంతో నిజాయితీతో పలికిస్తాడు. అయితే.. కథల ఎంపికలో కనీస స్థాయి జాగ్రత్తలు పాటించకపోవడంతో హీరోగా హిట్ కొట్టలేకపోతున్నాడు.
గౌరి కిషన్ కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది. సంతోష్ తో గొడవపడే సన్నివేశాలు, కమెడియన్స్ తో స్క్రీన్ ను చాలా హుందాగా షేర్ చేసుకుంది.నాగబాబు, రోహిణి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మెహబూబ్ బాషా పంచ్ డైలాగులు అలరిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల రాసుకున్న కథలో కానీ, ఆ కథను నడిపించిన విధానంలో కానీ ఎక్కడా కొత్తదనం లేదు. ఇప్పటికి తెలుగులో వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తలపించే సన్నివేశాలు, వాటి కంపోజిషన్ దర్శకుడిగా ప్రశాంత్ పనితనానికి ప్రతీకగా నిలుస్తాయి. కెమెరా వర్క్, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ గట్రా టెక్నికాలిటీస్ అన్నీ వెబ్ సిరీస్ క్వాలిటీని తలపిస్తాయి.
విశ్లేషణ: సంతోష్ శోభన్ కాస్త గ్యాప్ తీసుకొని.. మంచి కథలపై దృష్టి సారిస్తే మంచిది. లేదంటే.. ఏడాదికి ఆరు సినిమాలు చేసినా.. హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం పక్కన పెడితే, నటుడిగా తన ఉనికిని కోల్పోవడం ఖాయం.