ప్రముఖ గేయ రచయిత, దివంగత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనతో కలసి పని చేసిన ప్రముఖులు చాలామంది హాజరై.. సిరివెన్నెలతో వాళ్ల అనుభవాలను తెలియజేశారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మరకతమణి కీరవాణి, శ్రీశైల శ్రీ రాజమౌళి.. ఇలా తమకు తమ పెదనాన్నే పేర్లు పెట్టారని, అలా తన కూతురికి ఇలాంటి పేరే పెట్టాలనుకున్నా సరైన పేరు దొరకలేదు అని రాజమౌళి గుర్తు చేసుకున్నారు.
అలా పేరు కోసం అనుకుంటున్నప్పుడు సిరివెన్నెల రాసిన ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం..’ పాట నుండి పేరు పెట్టాం అని చెప్పారు. ఆ పాట చరణంలోని ‘మయూఖ’ అనే పదం పట్టుకుని తన కుమార్తెకు ఆ పేరు పెట్టాం అని చెప్పారు రాజమౌళి. తనను పొగిడితే వచ్చే సంతోషం కన్నా.. తన పనిని మెచ్చుకుంటేనే ఎక్కువ ఆనందిస్తానని చెప్పిన రాజమౌళి.. అంఉదకే పద్మశ్రీ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి వెళ్లకూడదు అనుకున్నారట.
ఆ సమయంలో సిరివెన్నెల గారికి కూడా చెప్పారట . ఆ రోజు ఆయన తనను కోపంగా తిట్టారని రాజమౌళి చెప్పారు. భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీకి అర్హుడివి అని భావించి.. పురస్కారం అందిస్తుంటే ఎందుకు తీసుకోవు. అతి వేషాలు వేయొద్దు.. నోరు మూసుకొని వెళ్లి తీసుకో అని అన్నారట. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాను సిరివెన్నెల చూసి ఫోన్ చేసేవారట. బాగున్నవి, బాగోలేని సన్నివేశాలను వివరించి సలహాలు ఇచ్చేవారట.
అలా ఎన్నో విషయాల్లో ఆయన నాకు గురువు అని రాజమౌళి గొప్పగా చెప్పుకొచ్చారు. కష్టసమయాల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు విని ఆ బాధ నుండి బయటకు వచ్చిన మనుషులు లక్షల్లో ఉంటారని చెప్పిన రాజమౌళి.. పాటను కేవలం పాటలానే కాకుండా జీవిత సత్యంగా చెప్పేవారు అని రాజమౌళి తెలిపారు.