సినీ పరిశ్రమలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఎంత మాత్రం తగ్గడం లేదు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎవరొకరు ప్రాణాలు విడుస్తున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో, మరికొంతమంది రోడ్డు ప్రమాదాల కారణంగా.. ఇంకొకరు సూసైడ్ వంటివి చేసుకోవడం…… ఇలా ఏదో ఒక రకంగా మరణిస్తూనే ఉన్నారు. తెలుగులోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా మరణిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ఇప్పటికే దర్శకురాలు అపర్ణ మల్లాది, సప్తగిరి తల్లి వంటి వాళ్ళు చాలా మంది మరణించారు.
ఇంతలోనే మరో బ్యాడ్ న్యూస్ కూడా వినాల్సి వచ్చింది. తమిళ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. సీనియర్ తమిళ దర్శకుడు, నటుడు అయినటువంటి ఎస్‌ఎస్ స్టాన్లీ (SS Stanley ) మృతి చెందారు. ఈయన వయసు 58 ఏళ్లు కావడం గమనార్హం. కొన్నాళ్ల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన చెన్నైలోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది.
ఈ వార్తతో తమిళ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొందరు సినీ ప్రముఖులు స్టాన్లీ (SS Stanley ) మరణానికి చింతిస్తూ తమ సానుభూతి తెలుపుతున్నారు. స్టాన్లీ సినీ కెరీర్ ను గమనిస్తే… దర్శకుడిగా… ‘పుదుకొట్టయిరుందు శరవణన్’ ‘ఏప్రిల్ మంత్’ ‘ఈస్ట్‌కోస్ట్ రోడ్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. అలాగే నటుడిగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన ‘మహారాజ’ (Maharaja) వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.