సినిమాని వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి.ఈరోజు అలనాటి స్టార్ హీరోయిన్ జమున గారు మరణించారు. అనారోగ్య సమస్యలతో ఆమె మరణించడం జరిగింది. ఆ షాక్ నుండి ఇంకా ఇండస్ట్రీ కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కూడా మరణించారు. చెన్నైలో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు శ్రీనివాస మూర్తి. ఈయన తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ స్టార్ హీరోలు ఎంతో మందికి ఈయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
సాయి కుమార్ అందుబాటులో లేనప్పుడు మన రాజశేఖర్ గారికి కూడా ఈయన డబ్బింగ్ చెప్పేవారు. అలాగే తమిళ స్టార్ హీరోలు సూర్య, అజిత్, విక్రమ్.. అలాగే మలయాళం స్టార్స్ అయిన మోహన్ లాల్, జయరాం లకు కూడా ఈయన తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. ఈయన డబ్బింగ్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. స్టార్ హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఈయన డబ్బింగ్ చెప్పేవారు. ఇలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ ను కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటుగానే భావించాలి.
సాధారణంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ దక్కదని అక్కినేని నాగేశ్వరరావు వంటి గొప్ప నటులు పలు సందర్భాల్లో చెప్పేవారు. శ్రీనివాస మూర్తి విషయంలో కూడా మొదట్లో ఇది నిజమైంది. అందువల్ల ఈయన టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు పొందలేకపోయారు. అయితే సూర్యకి తెలుగులో ఉన్న మార్కెట్ వల్ల ఇతను బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈయన మరణానికి చింతిస్తూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.