టాలీవుడ్‌లో హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నటి లావణ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇద్దరి మధ్య తలెత్తిన వ్యక్తిగత సమస్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ వరకు వెళ్లింది. తాజాగా లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించడంతో, ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. లావణ్య ఫిర్యాదు ప్రకారం, మస్తాన్ సాయి ఆమె వ్యక్తిగత వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది.
Raj Tarun, Lavanya
అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖుల ప్రైవేట్ వీడియోలు అతని దగ్గర ఉన్నట్లు చెప్పడం గమనార్హం. అందులో ఓ యువ హీరో వీడియోలు, ప్రముఖ వ్యక్తి కి సంబంధించిన లీక్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై పోలీసులు సీరియస్‌గా స్పందించి మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ వీడియోల్లో కొంతమంది ప్రముఖులు, యువ హీరోలు, ఇతర ఇండస్ట్రీ వ్యక్తుల డేటా కూడా ఉందని సమాచారం. అంతేకాకుండా, మస్తాన్ సాయి తన బాధితులను మత్తులోకి నెట్టి, వీడియోలు రికార్డ్ చేసేవాడని లావణ్య ఆరోపించారు. ఇప్పటికే మస్తాన్ సాయిపై అనేక మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు మరింత లోతుగా వెళ్లే అవకాశముంది. సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ కింద అతనిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అతని గత నేర చరిత్రను పరిశీలిస్తూ మరిన్ని వివరాలను బయటకు తీయడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.