‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది అనే ఓ రెగ్యులర్ పాయింట్‌ను పట్టుకుని చాలా నెలల పాటు మీడియాలో సినిమా పేరు నానేలా చేసింది సినిమా టీమ్. దానికి కారణం ఆ పాటలో స్టెప్పులేసే హీరోయిన్, ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ ఎవరు అనే మాట పట్టుకుని ఆ సినిమా పేరు వార్తల్లో కంటిన్యూగా చక్కర్లు కొట్టేలా చేశారు. అయితే అందులో ఎక్కువగా వినిపించిన పేరు జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఫైనల్‌గా అందులో ‘కిస్సిక్’ అంటూ శ్రీలీల (Sreeleela) వచ్చేసింది.
Pushpa 3
ఇప్పుడు మరోసారి జాన్వీ కపూర్ పేరు ‘పుష్ప’రాజ్ పేరుతో కలిపి వినిపిస్తోంది. దానికి కారణం ‘పుష్ప: ది ర్యాంపేజ్’. పుష్ప మళ్లీ వస్తాడు అంటూ ‘పుష్ప: ది రూల్’లో టీమ్ ఓ పోస్టర్ వేసి మరీ చెప్పింది. ఆ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉంటే (కచ్చితంగా ఉంటుంది అనుకోండి) దానికి జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది అని ఆ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అంటున్నారు.
‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ‘కిస్సిక్..’ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని తమకు ముందే తెలుసని, శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌కు చెప్పానని డీఎస్పీ చెప్పారు. ఎంతోమంది అగ్ర కథానాయికలు మొదటిసారి నా కంపోజిషన్‌లోనే ప్రత్యేక గీతాల్లో అలరించారు అంటూ పూజా హెగ్డే (Pooja Hegde), సమంత (Samantha), శ్రీలీల, కాజల్ అగర్వాల్‌ను (Kajal Aggarwal) గుర్తు చేశారు దేవిశ్రీ.
‘పుష్ప 3’ (Pushpa 3) సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేవారి గురించి కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయని, ఈ విషయమై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారని డీఎస్పీ అన్నారు. తనవరకు చూస్తే సాయి పల్లవి (Sai Pallavi) డ్యాన్స్‌కు అభిమానినని, జాన్వీ కపూర్ అద్భుతమైన డ్యాన్సర్ అని పొగిడేశారు. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో ఉందన్నాడు. జాన్వీ అయితే ‘పుష్ప 3’ ఐటెమ్ పాటకు సరైన ఎంపిక అని అనుకుంటున్నానని చెప్పారు.