సినిమా అంటేనే రంగుల ప్రపంచం అని అంతా అనుకుంటారు. కానీ ఇక్కడి జనాలు చాలా సెన్సిటివ్ అని… ఇక్కడ గ్లామర్‌తో పాటు అప్పుడప్పుడు పోటీ జనాల మధ్య విభేదాలు, గొడవలు కూడా ఉంటాయని చాలా మందికి తెలీదు. అలాంటి వాటిలో ఒకటి ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దానికోసం మనం 2001 కి వెళ్ళాలి. ఆ ఏడాది ‘అజ్‌నబీ’ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద రచ్చ చోటు చేసుకుంది. ఆ సినిమాలోని హీరోయిన్లు (Heroines) కరీనా కపూర్ (Kareen Kapoor), బిపాసా బసు (Bipasha Basu) మధ్య మొదటి నుంచీ అస్సలు పడేది కాదట.
అసలు గొడవకు కారణం ఏంటంటే, కరీనాకు చెప్పకుండా ఆమె పర్సనల్ స్టైలిస్ట్ విక్రమ్ ఫడ్నీస్‌తో బిపాషా పని చేయించుకుందట. ఈ విషయం కరీనాకు తెగ కోపం తెప్పించింది. ఇక చూస్కోండి, సెట్‌లో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవే జరిగిందట. ఆవేశంలో కరీనా ఏకంగా బిపాసాను చెంపదెబ్బ కొట్టిందని, అంతేకాదు ‘కాలీ బిల్లీ’ (నల్లపిల్లి) అని దారుణంగా కామెంట్ చేసిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.
దీనికి బిపాసా కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. కరీనా ప్రవర్తన చాలా చిన్నపిల్లల చేష్టలా ఉందని, ఇకపై ఆమెతో కలిసి పనిచేయనని తెగేసి చెప్పేసింది. ఆ తర్వాత, కరీనా ‘ఆప్ కీ అదాలత్’ అనే పాపులర్ షోకి వచ్చినప్పుడు, హోస్ట్ రజత్ శర్మ ఈ ‘కాలీ బిల్లీ’ కామెంట్ గురించి సూటిగా అడిగేశారు. కరీనా దాన్ని ఖండించలేదు సరికదా, ‘అయితే నేను తెల్లపిల్లిని అనుకోండి’ అంటూ నవ్వేసి, కూల్‌గా ఆ విషయాన్ని పక్కనపెట్టేసింది.
కొంతకాలానికి బిపాసా ఈ విషయంపై స్పందించి ‘ఈ గొడవను మీడియా అనవసరంగా పెద్దది చేసిందని’ చెప్పింది. అసలు గొడవ కరీనాకు, డిజైనర్‌కు మధ్య జరిగిందని, తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. మీడియా చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిందని, ఇదంతా చైల్డిష్‌గా అనిపించిందని కొట్టిపారేసింది.