సినిమాల రివ్యూల విషయంలో పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) స్టైలే వేరు. ఎవరూ ఊహించని విధంగా ఆయన రివ్యూలు ఉంటాయి. సినిమా వచ్చి చాలా రోజులు అయిన తర్వాతే ఆ సినిమా పంచనామా చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు సినిమా ట్రైలర్ మీద తన అనాలసిస్ చెప్పారు. సినిమా టైటిల్ సైజ్, విజయం సైజు అంటూ కాస్త కొత్తగా తన అనాలసిస్‌ను వివరించారు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2).
డిసెంబరు 5న ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల సినిమా ట్రైలర్‌ను లాంచ్‌చేసింది. దానిపై ప్రముఖ సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పెద్ద పేరు పెడితేనే సినిమాలు ఆడతాయనే రూల్ లేదు. చిన్న పేరు పెట్టి కూడా పెద్ద విజయాలు అందుకోవచ్చు అని ఈ సినిమా నిరూపించింది అని ‘పుష్ప’ గురించి చెప్పుకొచ్చారు. ‘పుష్ప’ సీక్వెల్‌కి ‘ది రూల్’ అని ఎక్స్‌టెన్షన్ పెట్టి హీరో ఇందులో రూల్ చేస్తాడని చెప్పకనే చెప్పారు.
‘పుష్ప (Pushpa) అంటే పేరు కాదు బ్రాండు’ అని డైలాగ్ రాయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో ‘పుష్ప’రాజ్‌లో రాజసం ఉట్టిపడుతుందని నమ్ముతున్నాను. ఎర్ర చందనం దొంగ (హీరో) హెలికాప్టర్ నుండి దిగే షాట్‌తో నేరస్థులు ఎక్కడి వరకు వెళ్తున్నారనే విషయాన్ని చూపించారు. ఇక ‘శ్రీవల్లి నా పెళ్లాం.. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటాదో పపంచకానికి చూపిస్తా’ అనే గొప్ప మాటని రాయడం బాగుంది.
అలాగే ‘నాకు రావాల్సిన పైసా.. అణా అయినా అర్ధణా అయినా.. అది ఏడు కొండల మీదున్నా.. ఏడు సముద్రాలు దాటి ఉన్నా, పోయి తెచ్చుకోవడం పుష్పగాడికి అలవాటు’ అనే డైలాగ్‌తో హీరో పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో చెప్పారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనలు అనే మాటతో ‘పుష్ప 2’తో ప్రాజెక్టు ఇంటర్‌నేషనల్ లెవల్‌కి వెళ్లిందని సులభంగా గుర్తు చేశారు అని ట్రైలర్‌ను ఆసక్తికరంగా విశ్లేషించారు పరుచూరి గోపాలకృష్ణ.