మాస్ బీట్ తెలిసిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్. హుషారైన ట్యూన్స్ తో పాటలను కంపోజ్ చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలకు సంగీతాన్ని అందించారు. కేవలం స్వర కల్పనకే పరిమితం కాకుండా పాటలు పాడారు. అతను పాడితే మజా ఏముంది? అనుకున్నారేమో .. నటీనటుల చేత పాటలు పాడించి ఔరా అనిపించారు. థమన్ సంగీత దర్శకత్వంలో పాటలు పాడిన స్టార్స్ పై ఫోకస్…
ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన రభస సినిమాకోసం పాడారు. రాకాసి రాకాసి అనే పాటతో తనలోని గాయకుడిని బయటపెట్టారు. తర్వాత కన్నడ సినిమా చక్రవ్యూహ సినిమాలో గెలియా గెలియా అనే పాట పాడారు. ఎప్పుడూ నటనకు అవార్డ్స్ అందుకునే తారక్ ఈ పాట ద్వారా గాయకుడిగా అవార్డు అందుకున్నారు.
రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ సినిమా కిక్ తో థమన్ ఫామ్లోకి వచ్చారు. వీరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. మిరపకాయ్ లో అడిగోరా చూడు, బలుపు లో కాజల్ చెల్లివా, హలో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ పాటను మొదలుపెట్టారు. పవర్ లో మాత్రం “నోటంకి నోటంకి” అంటూ పూర్తి పాట పాడారు.
మహేష్ బాబు
మహేష్ బాబు తో కూడా థమన్ పాట పాడించారు. బిజినెస్ మ్యాన్ సినిమా థీమ్ సాంగ్ ని పూరి జగన్నాథ్, మహేష్ బాబుతో పాడించి, మాట్లాడించి పిచ్చెక్కించారు.
ధనుష్
ధనుష్ వై థిస్ కొలవరి తో గాయకుడిగా నిరూపించారు. అతను ఇతర హీరో సినిమాలకు పాడలేదు. అయినప్పటికీ సాయి ధరమ్ తేజ్ తిక్క మూవీలో టైటిల్ సాంగ్ పాడించారు.
శింబు
తమిళ హీరో శింబు తెలుగు, తమిళంలో అనేక పాటలు పాడారు. థమన్ దర్శకత్వంలో వచ్చిన తిక్కలో “హాట్ షాట్ హీరో” అంటూ హూషారెత్తించారు.
శృతి హాసన్
పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో శృతిహాసన్ సింగర్ గా అందరికీ పరిచయమే. కానీ సినిమా పాటలు పాడలేదు. థమన్ దర్శకత్వంలో వచ్చిన రేస్ గుర్రం లో థమన్ తో కలిసి “డౌన్ డౌన్ డప్పా” పాట పాడి అలరించింది.
సిద్ధార్థ్
లవర్ బాయ్ సిద్దార్ధ్ సినిమా నిర్మాణంలో అనేక విభాగాల్లో పనిచేశాడు. “లవ్ ఫెయిల్యూర్” సినిమాలో పార్వతి పార్వతి అనే సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు.
సుమ
మాటల మిషన్ గన్ సుమ వ్యాఖ్యాతగానే అందరికీ తెలుసు. ఆమెను కూడా థమన్ సింగర్ ని చేశారు. విన్నర్ సినిమాలో సుమ “సుయా సుయా” అనే పాటను పూర్తి ఎనర్జీతో పాడి అదరగొట్టారు.