మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజే ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలైంది. ఇది కాకుండా ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు #మెగా154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ టైటిల్ ను మాత్రం ఫిక్స్ చేసేశారు.
కథ ప్రకారం.. దీనికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పేశారు. ఈ టైటిల్ వెనుక ఓ స్టోరీ ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దర్శకనిర్మాతలకు ఫొటోలు పంపడానికి ఓ కెమెరా అవసరమైందట. తన తండ్రి వెంకట్రావు గారితో పాటు పోలీస్ శాఖలో పనిచేసిన ఆయన కొలీగ్ వీరయ్య ఈ విషయంలో సహాయం చేసి చిరంజీవిని అందంగా ఫొటోలు తీసి ఆయనే స్వయంగా మద్రాస్ కు పంపేవారట.
ఒక్కోసారి చిరంజీవికి చెప్పకుండా నిర్మాణ సంస్థలకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయట. అలా వీరయ్య తీసిన ఫొటోల ఆల్బమ్ ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన సమయంలో చిరు చాలా ఉపయోగపడింది. ఒకవేళ వీరయ్య గనుక లేకపోయి ఉంటే అంతబాగా తీసే కెమెరా మెన్ ను వెతుక్కోవాల్సి వచ్చేదని చిరు చెప్పారు. అలా మెగాస్టార్ మనసులో వీరయ్య విషయంలో కృతజ్ఞత అలా ఉండిపోయింది. దర్శకుడు బాబీ చెప్పిన కథ వినగానే వైజాగ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి వీరయ్య పేరు బాగుంటుందని చిరు చెప్పారట. అలా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.