సినిమా నచ్చకపోతేనో, సినిమాలోని కంటెంట్ నచ్చకపోతేనో.. ఆ సినిమా నచ్చలేదు అనే రోజులు పోయాయి. ఇప్పుడు రోజులన్నీ ‘మనోభావాలు దెబ్బతిన్నాయ్’ అని చెప్పే రోజులే. ఆ విషయం పక్కనపెడితే… ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న సినిమా ‘టైగర్’ అదేనండీ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాల్సిందే అంటూ స్టూవర్ట్‌పురం గ్రామస్థులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. పైన చెప్పినట్లు ఈ సినిమాపై రోజు రోజుకూ వివాదం ముదురుతోంది.
ఓవైపు సినిమా టీమ్ ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరోవైపు సినిమాపై నిషేధం విధించాలంటూ స్టూవర్ట్‌పురం వాసులు నిరసనలు ముమ్మరం చేస్తున్నారు. ఈ మేరకు స్టూవర్టుపురం గ్రామస్థులు ఏకంగా నిరసన దీక్షకు దిగారు. తమ జాతిని, తమ గ్రామాన్ని కించపరిచేలా ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాను రూపొందించారు అనేది గ్రామస్థుల ఆరోపణ. ఎరుకల వర్గానికి చెందిన టైగర్ నాగేశ్వరావును గజదొంగలాగా చూపించడంతోపాటు, స్టూవర్టుపురంలో ఉన్న అందరూ దొంగలు అనే విధంగా సినిమా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమాను ఆపాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టూవర్టుపురం గ్రామస్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఎరుకలను కించపరిచేలా టీజర్‌లో డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని ప్రజా ప్రయోజన వాజ్యంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరోవైపు గురువారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఎరుకలు నిరసన దీక్ష నిర్వహించారు.
సినిమాను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు కూడా. స్టూవర్టుపురం గ్రామాన్ని దక్షిణ భారతదేశ నేర రాజధానిగా చూపించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు చూపిస్తున్నామని, అంతేకానీ కొత్తగా తామేదీ కల్పించి చూపించడం లేదని సినిమా టీమ్ చెబుతోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వస్తుందో చూడాలి. ఈ సినిమాను అక్టోబరు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.