టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో ముందువరసలో ఉండే డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. సినిమాల్లోకి రాకముందు మ్యాథ్స్ టీచర్ గా పని చేసిన సుకుమార్ ఆర్య సినిమాతో టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు యువతను ఆకట్టుకున్నారు. ఈతరం ప్రేక్షకులలో కూడా చాలామంది ఆర్య సినిమాను ఇష్టపడతారు. నిర్మాత దిల్ రాజుకు ఆర్య సినిమా భారీ లాభాలను అందించింది.
అయితే చాలామంది దర్శకులలా ఈ డైరెక్టర్ రెండో సినిమా జగడం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. భారీ అంచనాలతో విడుదలైన జగడం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమాలోని పాటలు హిట్టైనా సుకుమార్ కు సక్సెస్ సొంతం కాలేదు. ఆ తర్వాత ఆర్య సినిమాలోని పాత్రల స్పూర్తితో సుకుమార్ ఆర్య2 సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా సినిమా హిట్ కాలేదు.
ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో 100% లవ్ సినిమాను తెరకెక్కించి సుకుమార్ సక్సెస్ అందుకున్నారు. అయితే 1 నేనొక్కడినే సినిమాతో మరో ఫ్లాప్ సుకుమార్ ఖాతాలో చేరింది. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయి. అయితే నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలతో సుకుమార్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడంలో సుకుమార్ ఫెయిల్ అవుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పుష్ప సినిమా విషయంలో సుకుమార్ రొటీన్ కథను ఎంచుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సినిమా కథ, కథనంలో కొత్తదనం చూపిన సుకుమార్ రంగస్థలంను కొన్ని విషయాల్లో ఫాలో కావడం పుష్పకు మైనస్ అయింది. పుష్ప పార్ట్2 విషయంలో సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు రిలీజయ్యే రెండు రోజుల ముందు వరకు జరగడం కూడా పుష్పకు మైనస్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.