ఓ దర్శకుడు కథ రాసుకున్నప్పుడు.. ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని రాసుకోవచ్చు.. కానీ తర్వాత అది ఆ హీరోతోనే పట్టాలెక్కుతోంది అని చెప్పలేం. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ‘పోకిరి’ (Pokiri) పవన్ కళ్యాణ్ కోసం పూరి (Puri Jagannadh) అనుకుంటే రవితేజతో (Ravi Teja) మొదలు పెట్టాల్సి వచ్చింది. కానీ అక్కడ కూడా ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. మహేష్ బాబు (Mahesh Babu) దగ్గరకు వెళ్లి అది ‘పోకిరి’ గా బయటకు వచ్చింది. అలాగే కృష్ణతో (Krishna) ‘ఖైదీ’ (Khaidi) అనుకుంటే చిరంజీవి (Chiranjeevi) వద్దకు వెళ్ళింది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరిగ్గా ఈ కోవలోకి వస్తుంది ‘అల్లరి ప్రియుడు’ (Allari Priyudu) అనే సినిమా..! ‘రామానాయుడు స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ల పై కె.కృష్ణమోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) ఈ చిత్రానికి దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమాని సుమన్ తో (Suman) చేయాలని రాఘవేంద్ర రావు అనుకున్నారు. కానీ ఆ టైంలో సుమన్ ఒక కేసులో చిక్కుకోవడం.. జైలుకు వెళ్లడం జరిగింది. అందువల్ల వేరే హీరో కోసం గాలించడం మొదలుపెట్టారు దర్శకేంద్రుడు.
ఇలాంటి టైంలో ఆయన రాజశేఖర్ ను (Rajasekhar) ఫైనల్ చేశారు. అప్పటివరకు రాజశేఖర్ ఇమేజ్ వేరు. ఎక్కువగా సీరియస్ సినిమాలు చేశాడు రాజశేఖర్. అలాగే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. మరి అలాంటి నటుడితో ‘అల్లరి ప్రియుడు’ అనే రామ్- కామ్ చేయాలని రాఘవేంద్రరావు అనుకున్నప్పుడు.. చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.
అయినప్పటికీ రాఘవేంద్రరావు మొండితనం పేరు, ఆయన కాన్ఫిడెన్స్ వేరు. చివరికి అవే నగ్గాయి. 1993 మార్చి 5న ‘అల్లరి ప్రియుడు’ రిలీజ్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రాజశేఖర్ లవర్ బాయ్ గానే కాకుండా కామెడీతో కూడా మెప్పించారు. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 32 ఏళ్ళు పూర్తి కావస్తోంది.