పక్కన పక్కన నాలుగు సెట్లు.. పది కెమెరాలు.. ఇంచుమించు అన్నే మానిటర్‌లు.. ఇక లైట్లు, హడావుడికి అడ్డే లేదు. ఇదంతా నాలుగైదు సినిమాల వాతావరణం కాదు. ఒకే సినిమాకు సంబంధించిన షూటింగ్ వాతావరణం అంట. ఏంటీ నమ్మడం లేదా. ఈ విషయం తెలిసినప్పుడు మేమూ నమ్మేలేదు. అయితే ఈ సీన్స్‌ను దగ్గుండి చూస్తున్న ఆ సినిమా టీమ్ కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి షూటింగ్ తెలుగులో చూడలేదు అని అంటున్నారు మరి.
ఇంతకీ ఎవరి సినిమానో తెలుసా? పవన్ కల్యాణ్ – సాయితేజ్ సినిమా. అవును, ‘వినోదాయ చిత్తాం’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న సినిమాలో సెట్స్‌లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది అంటుంటారు కదా. దానికి నిలువెత్తు రూపం ఈ సినిమా షూటింగ్ అంటున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ 20 రోజుల కాల్‌షీట్లు ఇచ్చారనే విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో షూటింగ్ పర్‌ఫెక్ట్‌గా పూర్తయ్యేలా సముద్రఖని చేస్తున్న పని ఇదట.
ఓ సెట్‌లో సీన్ అయిన వెంటనే కట్ చెప్పేసి.. పక్క సెట్‌కి నడుచుకుంటూ వెళ్లి అక్కడ సీన్ తీసేస్తున్నారట. ఆ వెంటనే కట్, మరో సెట్, మరో సీన్ లాంటివి రోజులో చాలావరకు జరుగుతున్నాయి అంటున్నారు. సముద్రఖనికి సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతో.. ఇలా కంటిన్యూస్ షూటింగ్ చేయగలుగుతున్నారు అంటున్నారు. సుమారు 15 రోజులుగా షూటింగ్ జరుగుతుండగా.. రోజూ దాదాపు ఇలాంటి పరిస్థితే అంట.
త్రివిక్రమ్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వడం, మాతృక తీసిన అనుభవం ఉండటంతో ఏ సీన్‌కి ఎంత ఫుటేజ్ కావాలి అనే లెక్క పక్కాగా వేసుకుని సముద్రఖని సినిమా పూర్తి చేస్తున్నారట. మరి అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని టీమ్ అనుకుంటోందట. దీని కోసమే ఇంత వేగంగా సినిమా షూట్ చేస్తున్నారు అని సమాచారం.