ఇటీవల విడుదలైన ‘అజ్ణాతవాసి’ ట్రైలర్ చివర్లో మురళీశర్మ ఒక మాట అంటాడు ‘వీడు మళ్ళీ సైకిల్ ఎక్కుతాడంటావా’. అది పోలిటికల్ సెటైరా, సినిమాలోని సందర్భమా అనేది అప్రస్తుతం కానీ డైలాగ్ మాత్రం పేలిందనే మాట నిజం. అయితే.. ఈ సైకిలెక్కడం అనేది మన స్టార్ హీరోలకి కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారి “అజ్ణాతవాసి”లో సైకిలెక్కితే, మహేష్ బాబు “శ్రీమంతుడు” చిత్రంలో సగానికి పైగా సినిమాలో సైకిల్ తోనే కనిపిస్తాడు. “ధృవ”లో రామ్ చరణ్ రకుల్ తో రొమాన్స్ చేసింది సైకిల్ మీదే, “కంత్రి, రామయ్యా వస్తావయ్యా” చిత్రాల్లో ఎన్టీయార్ ఎంట్రీ సీన్స్ సైకిల్ మీదే ఉంటాయి. నితిన్ కూడా “లై” సినిమాల్లో హీరోయిన్ని పటాయించడం కోసం సైకిలెక్కడం విశేషం, ఇక రీసెంట్ గా శర్వానంద్ కూడా “మహానుభావుడు” చిత్రంలో సైకిల్ తో ఇచ్చిన స్టిల్స్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
అయితే.. నిన్నమొన్నటివరకూ కేవలం ఆరోగ్యం కోసమో లేక టైమ్ పాస్ కోసమో సైకిల్ కొన్న యువత పవన్ కళ్యాణ్ ఫోజుచ్చిన దగ్గరనుంచి ఆన్ లైన్ లో ఆ మోడల్ సైకిల్ ఎంత రేటు ఉంది అని ఆరాలు తీయడం ప్రారంభించారు. కొందరు ఆల్రెడీ కొనేశారు కూడా అనుకోండి. పోన్లెండి.. ఈ విధంగానైనా బైకులకు అతుక్కుపోయిన యువకులు సైకిళ్ళు ఎక్కడం మొదలెట్టారు. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయ్యి మిగతా హీరోల అభిమానులు కూడా సైకిళ్ళెక్కితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు.