సూపర్ స్టార్ కృష్ణ.. అభిమానులు ఎంతో ఆనందంగా పిలుచుకునే పేరు ఇది. అయితే ఆయనకు ఇంకొక పేరు ఉంది అదే సాహసాల హీరో కృష్ణ, మరొక పేరు కూడా ఉంది అదే రికార్డుల కృష్ణ. తెలుగు సినీ పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ అనే ఉపమానాలు వచ్చాయి అంటే ఆయన నుండే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్స్‌ప్రెస్ రైలులా సాగుతున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆయనే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్పీడ్ అందించారు. ఈ క్రమంలో ఆయన బద్దలుకొట్టిన రికార్డులు వేరెవరికీ సాధ్యంకావు అనొచ్చు. అలాగే వాటిని బద్దలుకొట్టే పరిస్థితులు ఎవరికీ లేవు అని కూడా అనొచ్చు.
* సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్‌లో 350కిపైగా చిత్రాల్లో నటించారు. అన్ని సినిమాల్లో నటించిన ఏకైక హీరో కృష్ణ మాత్రమే.
* తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా చేసింది ఆయనే. ఫస్ట్ కౌబాయ్ కూడా ఆయనే. ‘గూడఛారి 116’లో జేమ్స్ బాండ్‌గా కనిపిస్తే, ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో కౌబాయ్‌గా కనిపించాడు.
* 1965 నుండి 2009 వరకూ ఒక్క సంవత్సరమూ విరామం తీసుకోకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ. అంటే 45 ఏళ్ల పాటు గ్యాప్ లేకుండా సినిమాలు చేశారాయన.
* ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు కూడా ఆయనదే. 1972లో కృష్ణ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి.
* సినిమా పరిశ్రమలో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో ఎవరన్నా ఉన్నారంటే అది కృష్ణనే. తన కెరీర్‌లో ఆయన మొత్తంగా 50 మల్టీస్టారర్ సినిమాలు చేశారు.
* ఒకే ఊరులో ఒకే ఏడాది ఆరు చిత్రాలు వంద రోజులు పూర్తి చేసుకున్న రికార్డు కృష్ణకే సాధ్యమైంది. 1983లో ఆయన నటించిన ఆరు సినిమాలు విజయవాడలో వంద రోజులు ఆడాయి.
* 44 ఏళ్ల కృష్ణ కెరీర్‌లో 30 ఏళ్లు సంక్రాంతికి సినిమాలు విడుదల చేశారు. ఈ కారణంగానే ఆయన్ను సంక్రాంతి హీరో అనేవారు.
* కృష్ణ తన కెరీర్‌లో మొత్తంగా 105 మంది దర్శకులతో పని చేశారు. ఇక సంగీత దర్శకుల పరిస్థితి చూస్తే ఆ సంఖ్య 52గా ఉంది.
* డ్యూయల్, ట్రిపుల్ రోల్స్ చేయడంలో కృష్ణ ఎప్పుడూ ముందున్నారు. సుమారు 25 సినిమాల్లో ఆయన డ్యూయల్ రోల్‌లో నటించగా, ఏడు సినిమాల్లో కృష్ణ ట్రిపుల్ రోల్‌లో నటించారు.
* కృష్ణ సినిమాలు డబ్బింగ్ వెర్షన్‌ని కూడా ఎక్కువగా ఆదరణ దక్కేది. కృష్ణ నటించిన 20 సినిమాలు తమిళంలోకి డబ్ అయ్యాయి. హిందీలోకి 10 సినిమాలు డబ్బింగ్ అయ్యాయి.
* ఇక సతీమణి విజయనిర్మలతో కృష్ణ 50 సినిమాలు చేశారు. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది జయప్రదతోనే. ఆమెతో 43 సినిమాల్లో నటించారు. శ్రీదేవితో అయితే 31 సినిమాలు చేశారు.
* ఒకే దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డు తెలుగులో కృష్ణదే అవ్వొచ్చు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ దర్శకతంలో కృష్ణ 31 సినిమాలు చేశారు.