ఐదేళ్ల క్రితం పవన్ కల్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయింది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద రామ్ తాళ్లూరి ఈ సినిమాను ప్రకటించారు. వక్కంతం వంశీ కథతో ఆ సినిమా రూపొందుతుంది అని కూడా చెప్పారు. అయితే ఇదంతా జరిగి ఐదేళ్లు అయిపోయింది. ఇప్పటివరక సినిమా మొదలు కాలేదు. పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడమే దీనికి కారణం. అయితే ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి ప్రచారం మొదలైంది. దీనికి కారణం పవన్ తన బాకీని తీర్చేయాలని అనుకుంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడం, పవన్ కల్యాణ్ 100 శాతం స్ట్రయిక్ రేట్‌తో పార్టీ గెలవడం, పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు ఆయన తిరిగి తన సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. అలా పెండింగ్‌లో ఉన్న మూడు సినిమాల షూటింగ్‌ను పూర్తి చేశారు. దీంతో పవన్ చేతిలో కొత్త సినిమాలేవీ లేవు. ఒప్పుకున్న సినిమాల పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు అవ్వాల్సి ఉందంతే. దీంతో పవర్ స్టార్ ఇక సినిమాలు చేయరు అని అనుకన్నారంతా. మొన్నీమధ్య ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రచారం సందర్భంగా కూడా పవన్ అటు ఇటుగానేమ మాట్లాడారు.
అయితే, తాను గతంలో ఒప్పుకొని పెండింగ్‌లో పెట్టిన రామ్‌తాళ్లూరి – సురేందర్ రెడ్డి సినిమాను ముందుకు తీసుకెళ్లి బాకీ తీర్చేయాలని పవన్ అనుకుంటున్నారు అని వార్తలొస్తున్నాయి. అయితే గతంలో అనుకున్నట్లుగా స్ట్రయిట్ కథతో కాకుండా ఓ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు సెప్టెంబరు 2న టీమ్ నుండి ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న రోజుకు 2 గంటల పాలసీలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంత? పవన్ ఓకే చెప్పాడా? అనేది సెప్టెంబరు 2న తేలిపోతుంది.