కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ లు రద్దు కావడం, థియేటర్లు మూతబడడంతో చాలా మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తేయడంతో.. ఇండస్ట్రీ బాగుపడుతుందని ఆశ పడ్డారు. కానీ ఇంతలోపే సెకండ్ వేవ్ వచ్చి ఇండస్ట్రీని మరింత కుదిపేసింది. దీంతో మళ్లీ షూటింగ్ లు నిలిపివేసి.. థియేటర్లను మూసేశారు. దీంతో విడుదలకు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీలోకి వెళ్లిపోయాయి.
ఈ కారణంగా థియేటర్ వ్యవస్థ కూలబడిపోతుందని.. థియేటర్లను కాపాడడం కోసం అక్టోబర్ 2021 వరకు సినిమాలను ఓటీటీ రిలీజ్ చేయొద్దని.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. కానీ నిర్మాత సురేష్ బాబు తను నిర్మించిన ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మాత సురేష్ బాబు స్వయంగా స్పందించారు. సినిమాపై కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించే వారికే సినిమాలను ఎలా రిలీజ్ చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని అన్నారు.
అలానే తన సినిమాను ఎక్కడ రిలీజ్ చేయాలనే స్వాతంత్య్రం కూడా నిర్మాతకు ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా సమయంలో థియేటర్ యాజమాన్యాలు చాలా నష్టపోయాయని.. కానీ మంచి ధర వచ్చినప్పుడు సినిమాలను ఓటీటీలో విడుదల చేయడంలో తప్పేముందంటూ ప్రశ్నించారు. సినిమా విడుదలని కూడా బిజినెస్ కోణంలోనే ఆలోచించాలని చెప్పుకొచ్చారు.