 
                                                        ‘వరిసు’ / ‘వారసుడు’ సినిమాతో నిర్మాతగా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన దిల్ రాజు.. ఆ తర్వాత అక్కడ మరో సినిమా చేయడానికి చాలా నెలలుగా వెయిట్ చేస్తున్నారు. అవకాశం ఉన్న హీరోల డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన టీమ్‌లోని దర్శకులకు ఆ మేరకు కథలు సిద్ధం చేయాలని చెబుతున్నారు కూడా. కొంతమంది ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో ఇంకా ఏ సినిమా కూడా పట్టాలెక్కడం లేదు. అయితే ఇప్పుడు ఓ సినిమా ఫైనల్‌గా ఫిక్స్ అయింది అని చెబుతున్నారు.
దిల్ రాజు ఆస్థానంలో చాలా ఏళ్లుగా ఉన్న పరశురామ్ ఓ కథను సిద్ధం చేశారట. దానిని స్టార్ హీరో సూర్యకు ఇటీవల వినిపించారట. ఆసక్తికరంగా ఉండటంతో పూర్తి స్థాయి కథను సిద్ధం చేయమని సూర్య చెప్పారట. ఇప్పుడు పరశురామ్ అదే పనిలో ఉన్నారు అని చెబుతున్నారు. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది అని సమాచారం. ప్రస్తుతం సూర్య – వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ సినిమా లైన్‌లో ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తారు అని సమాచారం.

‘గీత గోవిందం’ సినిమా తర్వాత పెద్ద హీరోల దృష్టిలో పడిన పరశురామ్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేశాడు. అది కూడా ఇబ్బందికర ఫలితమే అందుకుంది. అప్పటి నుండి పరశురామ్ కొత్త సినిమా ఏదీ స్టార్ట్ కాలేదు. మధ్యలో కార్తికి ఓ సినిమా కథ చెప్పారని వార్తలొచ్చినా.. అది వర్కవుట్ కాలేదు. అలా తమ్ముడితో కాని ప్రాజెక్ట్ ఇప్పుడు అన్నయ్యతో అయింది అని అంటున్నారు.

మరి దిల్ రాజు ఈ సినిమాతో అయినా కోలీవుడ్‌లో ష్యూర్ షాట్ హిట్ దొరుకుతుందా అనేది చూడాలి. ‘వరిసు’ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయని టీమ్ చెబుతున్నా.. అప్పట్లో రివ్యూలు అయితే ఆ స్థాయిలో రాలేదు.
