ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ట్విట్టర్ వేదికగా టీచర్స్ డే రోజు “టీచర్స్” బాటిల్ పెట్టి శుభాకాంక్షలు తెలిపినందుకు విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుల వాణి ఫిర్యాదు చేసింది. వర్మ ట్వీట్లతో ఉపాధ్యాయులను అవమానించారని అందులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును వర్మ సీరియస్ గా తీసుకోలేదు. పైగా వారి కంప్లైంట్ ఇచ్చిన దానిలో అచ్చు తప్పులు ఉన్నాయని, కాబట్టి టీచర్స్ కన్నా తానే గొప్ప వాణ్నిగా గుర్తించాలంటూ నేటి విద్యార్థులకు చెప్పారు.
అంతేకాదు ఉపాధ్యాయులతో సమయం వృథా చేయకుండా, గూగుల్ నుంచి నేర్చుకోండని సలహా ఇచ్చారు. అంతకు ముందు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తనకు పాఠాలు చెప్పిన పండితుల గురించి పోస్టులు చేశారు. పాఠశాలలో, కళాశాలలో బలవంతంగా చదవని టీచర్స్ చెప్పిన రోజులు తన జీవితంలోనే చెత్త రోజులని పేర్కొన్నారు. తరగతిగదిలో హాస్య పుస్తకాలను చదువుతుంటే ఉపాధ్యాయులు అడ్డుపడేవారని పేర్కొన్నారు. ప్రతి రోజు ఇంటికి వచ్చి మాస్టర్లు చెప్పిన పాఠాలు చదవకుండా హాస్య పుస్తకాలను, ఫిక్షన్ నవలను చదివే వాడినని గుర్తు చేసున్నారు. ఒకరు మోకాలిపై కూర్చోమని చెప్పేవారు, మరొకరు కొట్టేవారు, ఒక టీచర్ అయితే డస్టర్ తో నా బుర్ర బద్దలు కొట్టారు, అప్పటి నుంచి నా బుర్ర పనిచేయడం లేదని చమత్కరించారు. మొత్తానికి వినాయక చవితి రోజు కూడా ట్వీట్లతో వర్మ వార్తల్లో నిలిచారు.