‘యానిమల్’ తర్వాత బాబీ డియోల్ రేంజ్ మారింది. గతంలో అతను హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అయినా తగిన గుర్తింపు రాలేదు. కానీ సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్’ లో అతని రోల్ చాలా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ విలన్ టైపు రోల్ కాదిది. విలన్ అంటే ‘బేస్ వాయిస్ తో అరవడాలు.. జనాలను డైలాగులతో భయపెట్టడాలు’ వంటివి ఆ సినిమాలో ఉండవు. అందులో విలన్ కి మాటలు రావు.
కానీ అతని ఎక్స్ప్రెషన్స్ తోనే భయపెడతాడు. ‘ ‘నిశ్శబ్దం’ చాలా వయొలెంట్ గా ఉంటుంది’ అనే త్రివిక్రమ్ డైలాగ్ కి ‘యానిమల్’ లో బాబీ డియోల్ రోల్ ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ‘యానిమల్’ కంటే ముందే బాబీ డియోల్ ను పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కోసం తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డిలే అవ్వడం వల్ల రిలీజ్ లేట్ అయ్యింది.
ఈలోపు ‘యానిమల్’ రిలీజ్ అయ్యింది. అయితే ‘యానిమల్’ తో బాబీ డియోల్ రేంజ్ మారడంతో ‘హరిహర వీరమల్లు’ లో అతని పాత్రలో మార్పులు చేశారట. ఇటీవల దర్శకుడు రత్నం కృష్ణ అలియాస్ జ్యోతి కృష్ణ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ.. ” ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషించారు. ‘యానిమల్’ సినిమాలో డైలాగులు లేకపోయినా బాబీ డియోల్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.
కళ్ళతో పలికించిన హావభావాలు అందరికీ కనెక్ట్ అయ్యాయి… అలరించాయి. అందుకే ‘యానిమల్’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ పాత్రని మార్చడం జరిగింది. దానిని మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేశాను. మొదట్లో బాబీ డియోల్ పాత్రకి మీరు త్వరలో స్క్రీన్ పై చూడబోయే పాత్రకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కచ్చితంగా ఈ పాత్ర కూడా బాబీ డియోల్ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.