‘క’ (KA) సినిమాలో వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) (Kiran Abbavaram) పోస్ట్‌మాన్‌గా నటించిన విధానం అందరిని ఆకట్టుకుంది. ఇక సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో “కృష్ణగిరి” గ్రామం హైలెట్ గా నిలిచింది. ఆ గ్రామం గురించి పెద్దాయన చెప్పే డైలాగ్ కూడా బాగా వైరల్ అయ్యింది, “మధ్యాహ్నం మూడు అయ్యేసరికి చీకటి పడిపోతుంది” అనే డైలాగ్ ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. నిజంగా అలాంటి ఊరు ఉందా అనే ప్రశ చాలామందికి కలిగింది, ఇక అలాంటి పల్లె ఒకటి నిజంగానే ఉంది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో “కొదురుపాక” అనే గ్రామంలో సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం మాత్రం ముందుగానే జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల కల్లా అక్కడ చీకటి పడి ఉంటుంది. దీంతో స్థానికులు ఈ గ్రామాన్ని “మూడు జాముల కొదురుపాక” అని పిలుస్తారు. ఉదయం సూర్యోదయం 8 గంటలకు జరగగా, సాయంత్రం 4 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఎత్తైన పాము బండ గుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉండటం వల్ల సూర్యరశ్మి అడ్డం పడిపోతుంది.
గ్రామస్థులు ఈ విశేషానికి అలవాటు పడి, వారి జీవన విధానాన్ని ఈ ప్రకృతిలోనే మెరుగుపర్చుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత చీకటి పడే ఈ గ్రామంలో వారు సాధారణంగా లైట్లు వెలిగించి పనులు కొనసాగిస్తారు. ఈ ఊరికి కొత్తగా వచ్చినవారు ఈ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోతారు. “సాయంత్రం సమయంలో గ్రామానికి చేరుకోవాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు” అని గ్రామస్థులు చెబుతారు.
ఇటీవల “క” సినిమా విడుదలైన తర్వాత కొదురుపాక గ్రామం ఎక్కువగా ప్రజలకు తెలిసింది. ఈ సినిమాతో ఆ గ్రామం సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో విపరీతంగా వైరల్ అయింది. “మూడు జాముల గ్రామం” గురించి తెలుసుకున్న వారు, నిజంగా ఈ గ్రామం ఉందా అని సెర్చ్ చేస్తున్నారు. కృష్ణగిరి లాంటి ఈ వాస్తవిక గ్రామం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఒక చిన్న మిస్టరీలా మారింది.