విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న విడుదలవుతుంది అని అనౌన్స్మెంట్ రాగానే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అదే రోజున ‘అర్జున్ రెడ్డి’ చిత్రం రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి.! ఆ సినిమా బయ్యర్స్ కు భారీ ప్రాఫిట్స్ ను అందించింది. పైగా విజయ్ దేవరకొండకి ఆగస్టు అనేది బాగా కలిసొచ్చిన నెల.
ఇదే నెలలో ‘గీత గోవిందం’ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది.అంతేకాకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అందుకే ‘లైగర్’ కు తిరుగులేదు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమా అందరి ఆశలపై నీళ్లు చల్లింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
మొదటి రోజు అతని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు నమోదు చేసింది. హిందీలో కూడా ఈ మూవీ నిలదొక్కుకుంది. కానీ ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) లో మాత్రం ఈ మూవీ ఘోరమైన రికార్డుని మూటకట్టుకుంది. ఐ.ఎం.డి.బి లో ‘లైగర్’ మూవీకి కేవలం 1.7/10 రేటింగ్ నమోదైంది. ఈ మధ్య కాలంలో భారీ హైప్ సొంతం చేసుకున్న మూవీకి ఇంత తక్కువ రేటింగ్ నమోదవ్వడం ‘లైగర్’ విషయంలోనే జరిగింది.
ఈ మధ్యనే వచ్చిన ‘ది లెజెండ్’ అనే చిత్రానికి ఐ.ఎం.డి.బి లో 4.7/10 రేటింగ్ నమోదైంది. ముక్కు మొహం తెలియని హీరో సినిమాకే మినిమం రేటింగ్ వస్తే విజయ్ దేవరకొండ లాంటి హీరో సినిమాకి ఇదేం రికార్డ్ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు చురకలు అంటిస్తున్నారు. దీంతో ‘లైగర్’ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.