టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎప్పుడూ మాస్ మసాలా సినిమాలతోనే బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఈసారి రూటు మార్చి ‘ది రాజా సాబ్’ తో హారర్ కామెడీ జోనర్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పటి నుంచి అందరికీ ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి.
అప్పట్లో చిరంజీవి తన ఇమేజ్ ని పక్కన పెట్టి చాలా కష్టపడి అంజి సినిమా చేశారు. గ్రాఫిక్స్ పరంగా ఆ మూవీ అప్పట్లో ఒక విజువల్ వండర్. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు రాజా సాబ్ లో కనిపిస్తున్న ఆ వింటేజ్ బంగ్లా సెటప్, కలర్ ఫుల్ సెట్టింగ్స్ చూస్తుంటే మళ్ళీ అదే స్థాయి గ్రాండియర్ కనిపిస్తోంది.
కేవలం అంజి మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా కూడా ఇలాంటి సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. ఆ భారీ చిత్రం కూడా ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో స్టార్ హీరోలు ఇలాంటి అల్ట్రా నాచురల్ సబ్జెక్టులు టచ్ చేయాలంటేనే ఒక రకమైన భయం ఇండస్ట్రీలో మొదలైంది. ఇది ఒక నెగటివ్ సెంటిమెంట్ లా మారిపోయింది.
కానీ రాజా సాబ్ సినిమా విషయంలో కొన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. అంజి లాంటి సినిమాలు సీరియస్ ఫాంటసీలు అయితే మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పక్కా హారర్ కామెడీ. సరదాగా నవ్విస్తూనే భయపెట్టే ఎంటర్టైనర్ కాబట్టి నేటి జనరేషన్ కి ఇది బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ కూడా ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం ఫ్యాన్స్ కి కొత్తగా అనిపిస్తుంది.
సంక్రాంతి పండగ సీజన్ లో రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ కి చాలా కీలకం. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ చాలా మారింది కాబట్టి విజువల్స్ అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొడితే మాత్రం టాలీవుడ్ లో ఉన్న ఆ పాత సెంటిమెంట్ బ్రేక్ అయిపోతుంది. మరి రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
