దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కలయికలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పూరీతో కలిసి ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 3 నెలల క్రితమే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. కానీ వెంటనే సెట్స్ పైకి వెళ్ళలేదు. విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళలేదేమో అని అంతా అనుకున్నారు. మరోపక్క ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నటీనటుల ఎంపిక కూడా జరిగింది.
సినిమాలో ఎంపికైన ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ వస్తున్నారు. కానీ షూటింగ్ డిలే అవ్వడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశం లేదు అని చాలా మంది చెప్పుకొచ్చారు. ఇంకొంత మంది బడ్జెట్ సమస్యల వల్ల డిలే అవుతుంది అన్నారు.
కానీ అసలు విషయం వేరు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే కాదు.. నిర్మాతలైన పూరీ – ఛార్మి కూడా చాలా నష్టపోయారు. ఈ సినిమాలకు ఫైనాన్స్ చేసిన వారికి కూడా క్లియరెన్సులు చేయలేదట. అందుకే పూరీ- సేతుపతి సినిమా డిలే అవుతూ వచ్చింది అని తెలుస్తుంది.
ఇటీవల ఈ ప్రాజెక్టులోకి ‘జె బి మోషన్ పిక్చర్స్’ అధినేత జె బి నారాయణ రావు ఎంటర్ అయ్యారు. ఆయన ప్రాజెక్టులో భాగం కావడం వల్ల.. పూరీ- ఛార్మి తమ ఫైనాన్సియర్లకి క్లియరెన్సులు చేయగలిగారట. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఫాస్ట్ గా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.