సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా “విరూపాక్ష”. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మిస్టిక్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగా మేనల్లుడి కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ నేపథ్యంలో వీక్ డేస్ లోనూ జనాలను థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ వీలైనంత వరకూ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు.
ఇందులో భాగంగా తాజాగా ‘కలల్లో’ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. ‘కలల్లో నేను ఉలిక్కి పడుతున్నా, నిజాన్ని ఓ కొలిక్కి తేవెంటే.. ఇలా అయోమయంగా నేనున్నా, ఇదంటూ తేల్చవేమిటే..’ అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. సెలయేటి సవ్వళ్లలో హీరో హీరోయిన్ల మధ్య సాగిన ఈ మెలోడీ సాంగ్ విజువల్ గానూ బాగుంది. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంట అందంగా కనిపించారు.
ఇందులో ఓవైపు ప్రకృతి అందాలను చూపిస్తూనే, మరోవైపు ప్రధాన జోడీ మధ్య కెమిస్ట్రీని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ‘కలల్లో’ గీతానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీశ్ లోక్ నాథ్ ఫ్రెష్ మెలోడియస్ ట్యూన్ ని కంపోజ్ చేసాడు. గాయనీ గాయకులు అనురాగ్ కులకర్ణి, మధుశ్రీ కలిసి వినసొంపుగా ఆలపించారు. ఈ పాటకు గీత రచయిత అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాసాడు. కెమెరామెన్ శ్యామ్ దత్ సైనుదీన్ అందించిన విజువల్స్, నాగేంద్ర ప్రొడక్షన్ డిజైనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేసారు. నిజానికి ‘కలల్లో’ పాట ‘విరూపాక్ష’ సినిమాలో లేదు. లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు కానీ.. ఫైనల్ సెన్సార్ కట్ లో ఈ సాంగ్ ని తొలగించారు. క్షుద్రపూజలు, చేతబడులు నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇలాంటి చిత్రాల్లో మధ్య మధ్యలో పాటలు రావడం వల్ల ఆడియన్స్ థ్రిల్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలానే సినిమా ఫ్లో మిస్ అయి క్యూరియాసిటీ తగ్గిపోతుంది.
ఈ కారణం చేతనే మంచి మెలోడీ అయినప్పటికీ ‘కలల్లో’ పాటను సినిమాలో పెట్టలేదనిపిస్తోంది. అందుకే ఇప్పుడు వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేసినట్లు అర్థమవుతోంది. ఒకవేళ ఈ పాట సినిమాలో పెట్టి ఉంటే ఎలా ఉండేదో మరి. కాగా, ‘విరూపాక్ష’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
తొలి రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యూఎస్ మార్కెట్ లోనూ అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 55 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు దీనికి సీక్వెల్ గా ‘విరూపాక్ష 2’ ఉంటుందని ప్రకటించారు.