నాలుగైదు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రులు పగలనక రాత్రనక అహరహం శ్రమిస్తూ ప్రజలకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఎక్కడా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీయం కూడా అయిన పవన్ కల్యాణ్ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. తన పర్సనల్ ట్విట్టర్ ఎకౌంట్ నుండి రాజకీయ నాయకులకు రిప్లైలు ఇస్తూ..
Pawan Kalyan
జనసేన ట్విట్టర్ ఎకౌంట్ నుండి ఇండస్ట్రీ వర్గాల వారికి రిప్లైలు ఇప్పిస్తూ యమ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. జనాల్లోకి రాకపోవడం ఆయన పొలిటికల్ ఇమేజ్ కు డ్యామేజ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా జనసేన సభ్యులు కూడా ఈ సహాయ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు. నిన్నంటే పుట్టినరోజు, పవన్ కల్యాణ్ కనిపిస్తే జనాలు గుమిగూడి లేనిపోని హడావుడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సోమవారం ఆయన కనిపించలేదంటే సరేలే అనుకోవచ్చు.
కానీ.. ఇవాళ పరిస్థితులు సర్దుమణుగుతున్న సమయంలో కూడా పవన్ కల్యాణ్ జనాల్లోకి రాకపోవడం అనేది జీర్ణించుకోలేని నిజం. కనీసం ఇప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా జనాల్లోకి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోకపోతే హీరోగా ఆయన్ను అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఆయన్ను తిట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. సీనియర్ అయిన చంద్రబాబు వయసును లెక్క చేయకుండా వరదనీటికి ఎదురెళ్తున్న తరుణంలో..
పవన్ కల్యాణ్ ఇలా కనబడకుండా ఉండడం అనేది ఆయనకి శ్రేయస్కరం కాదు. మరి పవన్ కళ్యాణ్ కనీసం రేపైనా జనాల్లోకి వచ్చి తన ఉనికిని చాటుకుంటాడో లేదో చూడాలి. అదే విధంగా ఆయన అభిమానులు కూడా “గబ్బర్ సింగ్” (Gabbar Singh) రీరిలీజ్ హంగామా మ్యానియా నుండి బయటపడి.. ఇప్పటికైనా వరద బాధితుల సహాయార్థం నడుం బిగిస్తే బాగుండు!