ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 (Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట విషాదం అందరినీ కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, శాంతి భద్రతలు, సామాజిక బాధ్యతలపై సినీ పరిశ్రమకు కీలక సూచనలు చేశారు. ఈ సంఘటనపై తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో జరిపిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మరోసారి ఆ వీడియోను చూపించారు.
CM Revanth Reddy
మహిళ మృతిచెందడం వల్ల తన బాధను వ్యక్తం చేస్తూ, థియేటర్ యాజమాన్యం చిత్రబృందం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని సూచించారు. “సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరోగా నిలవాలి,” అంటూ సినీ పరిశ్రమకు పరోక్షంగా సందేశం పంపించారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఒకరు మరణించిన కారణంగానే సీరియస్ కావాల్సి వచ్చిందని, ఇండస్ట్రీ అంటే ఎప్పుడు గౌరవమే అని అన్నారు.
అయితే బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ప్రజలకు హానికరమని స్పష్టంగా చెప్పి, తెలంగాణలో ఇకపై ఈ విధానం ఉండదని తేల్చిచెప్పారు. థియేటర్లలో గందరగోళ పరిస్థితుల నివారణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ (Allu Arjun) పట్ల తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని అన్నారు. “బన్నీ చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. అతనితో మంచి సంబంధాలు ఉన్నా, చట్టపరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పుడు నేను నా విధానాన్ని అనుసరిస్తాను,” అని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.
అతనిపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ థియేటర్ విషాదం తర్వాత, పుష్ప-2 చిత్రం అనుబంధంగా ప్రీమియర్ షోలపై సీఎం తీసుకున్న నిర్ణయం సినీ పరిశ్రమలో ప్రకంపనల సృష్టించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. పరిశ్రమలో సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.