2023 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వారసుడు మూవీ వాస్తవానికి జనవరి నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగా ఈ సినిమా వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు రేపటితో పూర్తి కానున్నాయని సమాచారం. అయితే మెగా నందమూరి ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే దిల్ రాజు వెనక్కి తగ్గారని తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు ట్రైలర్లు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ ట్రైలర్లకు వేర్వేరుగా 13 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సంక్రాంతికి ప్రేక్షకులు ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమాను మొదట థియేటర్లలో చూడాలని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో సోషల్ మీడియాలో దిల్ రాజుపై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది.
వారసుడు మూవీని మొదట రిలీజ్ చేయడం వల్ల భవిష్యత్తులో చిరంజీవి, బాలకృష్ణలతో దిల్ రాజు సినిమాలు చేయడం కూడా సాధ్యం కాదు. ఈ కారణాల వల్లే దిల్ రాజు తన సినిమాను కేవలం తెలుగులో మాత్రమే ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కంటే తక్కువ థియేటర్లలోనే తన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు దిల్ రాజు క్లారిటీ ఇవ్వడం కొసమెరుపు.
తనపై ఉన్న విపరీతమైన నెగిటివిటీ వారసుడు ఫలితంపై ప్రభావం చూపకుండా రిలీజ్ డేట్ వాయిదా ద్వారా దిల్ రాజు అభిమానులను కూల్ చేశారు. తమిళంలో వారిసు సినిమాకు వచ్చే టాక్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమాకు కేటాయించే థియేటర్లలో కూడా మార్పులు ఉంటాయి. ఏది ఏమైనా దిల్ రాజు చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.