సినిమాలు – రాజకీయాలు వీటి మధ్య పెద్ద దూరం ఉండదు అంటుంటారు. సినిమాల్లో ఉన్నవాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని లేదు. అలా అని రాజకీయాల్లో ఉన్నవాళ్లంతా సినిమాల్లోకి రావాలని లేదు. కానీ బంధం మాత్రం ఉంటుంది. తెలుగునాట ఈ బంధం చాలా రోజుల నుండి ఉన్నా.. ఎక్కువైంది మాత్రం ఎన్టీఆర్ వచ్చాకనే అని చెబుతారు. అప్పటి నుండి సినిమా వాళ్లు అంటే టీడీపీకి బాగా దగ్గర అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అదే పని చేయబోతోందా? ఏమో వరుస మీటింగ్‌లు చూస్తే ఈ డౌట్ వస్తోంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ కలిశారు. అందులో విషయమేముంది, గతంలో ఇద్దరి మధ్య స్నేహం ఉంది కాబట్టి కలిశారు అనుకోవచ్చు. అయితే ఇన్‌సైడ్ వర్గాలు మాత్రం ఈ కలయిక వెనుక ఏదో ఉంది అని చెబుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకమైన రోజులు, విషయాలు ఏమీ లేవు. ఈ సమయంలో రజనీకాంత్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మరీ ఎందుకు చంద్రబాబును కలిశారు అనేదే ఇక్కడ ప్రశ్న.
చంద్రబాబు, రజనీకాంత్ మధ్య దాదాపు అరగంటకు పైగా చర్చ జరిగింది అంటున్నారు. అయితే వారి మధ్య సాధారణ విషయాలే చర్చకు వచ్చాయి అని రజనీ సన్నిహితులు అంటున్నారు. అంతేకాదు ఇది ఏమాత్రం రాజకీయ భేటీ కాదని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు సాధారణ భేటీ జరగాల్సిన అవసరం ఏమొచ్చింది అనేదే ఇక్కడ చర్చ. గతంలో ఇలా ఏ కారణం లేకుండా చంద్రబాబు, రజనీకాంత్ ఎప్పుడూ కలవలేదు. అయితే ఇప్పుడు రజనీకాంత్ రాజకీయాలకు పూర్తిగా దూరం అనే విషయం గుర్తుంచుకోవాలి.
ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా కలిసి మాట్లాడారు. దీనిని పూర్తి రాజకీయ మీటింగ్ అనుకున్నా రజనీ మీటింగ్‌ను అలా అనుకోలేం. అయితే బీజేపీ నేతలకు, రజనీకాంత్‌కు ఇప్పుడు మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ కోణంలో బీజేపీ, టీడీపీని దగ్గర చేసే ఆలోచనలు సాగుతున్నాయా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్ టీమ్ కూడా సినిమా వాళ్లను ఆకర్షించే పనిలో పడింది. స్థలాలు ఇస్తాం వైజాగ్ వచ్చేయండి అని జగన్ ఆ మధ్య ఓపెన్ అఫర్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు.. ఇండస్ట్రీ మీద మాస్టర్ స్ట్రోక్ ఇస్తున్నారు అని అంటున్నారు. మరి ఎవరెవరు దాని కిందకు వస్తారో చూడాలి.