జూలై 8 నుండీ థియేటర్లు రన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో డిస్ట్రిబ్యూటర్ల సిబ్బందికి ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ మళ్ళీ కళ కళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది నిర్మాతలు తమ పాత సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ లిస్ట్ లో దిల్ రాజు ముందున్నారు. తన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకుని పవన్ అభిమానులను ఆకర్షించాలని ఆయన భావిస్తున్నారు.
ఆ చిత్రం ఫుల్ రన్లో బయ్యర్లకు రూ.4 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. అయితే డిజిటల్ రైట్స్ బిజినెస్ లో ఆ లాస్ కవర్ అయిపోయిందని వినికిడి. అయినప్పటికీ… మళ్ళీ ‘వకీల్ సాబ్’ ద్వారా క్యాష్ చేసుకోవాలనే ఆలోచన దిల్ రాజుకి ఉంది. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అంతేకాదు దిల్ రాజు బాటలో ‘క్రాక్’,’ఉప్పెన’, ‘జాతి రత్నాలు’ నిర్మాతలు కూడా తమ సినిమాలను మళ్ళీ రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ వారి ఆలోచనకు థియేటర్ యజమాన్యాలు అడ్డుకట్ట వేయనున్నాయి.
ఆల్రెడీ అందరి ఫోన్లలో ఉన్న పాత సినిమాలను రిలీజ్ చేయడం వల్ల.. టికెట్లు తెగవని, కొత్త సినిమాలు వస్తేనే జనాలకు థియేటర్లకు రావాలనే ఇంట్రెస్ట్ కలుగుతుందని వారు తెలియజేసారు.పాత సినిమాలు రిలీజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులు రెంట్లకు కూడా సరిపోవని వారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు తెలియజేసారట. దీంతో వచ్చే వారం నుండీ కొత్త సినిమాలని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘టక్ జగదీష్’ ‘రిపబ్లిక్’ ‘ఆరడుగుల బుల్లెట్’ వంటి సినిమాల్లో ఏదో ఒకటి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.