ఈ దసరాకి రెండు పెద్ద సినిమాలతో పాటు ‘స్వాతిముత్యం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ రెండు సినిమాలు కూడా విజయదశమి రోజు బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఇప్పుడు థియేటర్ల సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. రెండు పెద్ద సినిమాలకు థియేటర్లు అడ్జస్ట్ చేయడం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సమస్యగా మారిందట. ముఖ్యంగా ఈ రెండు సిఎంలకు నైజాంలో పెద్ద సమస్య వచ్చిందట.
నాగార్జున సినిమా నిర్మాత ఏషియన్ సునీల్. నైజాంలో వీరికి అత్యధిక థియేటర్స్ ఉన్నాయి. వారి బ్యానర్ లో తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్’కి ఎక్కువ థియేటర్లు కేటాయించుకుంటున్నారు. దీంతో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కడం లేదని మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి నైజాంలో భారీ థియేటర్లు దక్కాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో నిర్మాతల మీద, డిస్ట్రిబ్యూటర్ల మీద ఒత్తిడి మొదలైంది. చిన్న సినిమానే అయినప్పటికీ.. ‘స్వాతిముత్యం’ సినిమాకి నైజాంలో మంచి థియేటర్స్ పడనున్నాయి.
ఎందుకంటే ఈ సినిమా నిర్మాత నాగవంశీ పెద్ద ప్రొడ్యూసర్. ఈయనకు దిల్ రాజు సపోర్ట్ కూడా ఉంది. భారీ సినిమాలను నిర్మించే బడా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘స్వాతిముత్యం’కి డిస్ట్రిబ్యూటర్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ సినిమాల మధ్య ‘స్వాతిముత్యం’ సినిమాకి థియేటర్లు కేటాయించడం డిస్ట్రిబ్యూటర్లకు సవాల్ గా మారింది. మరి ఈ మూడు సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!