రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోవడంతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా ఎక్కువ అవుతుండడంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు వాయిదా పడడంతో.. పండక్కి ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండా పోయింది. చిన్న సినిమాలు దాదాపు పది వరకు విడుదలవుతున్నప్పటికీ సినీ ప్రియులకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా లైన్ లోకి వచ్చింది. జనవరి 14న ‘బంగార్రాజు’ సినిమా థియేటర్లో సందడి చేయనుంది.
ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. బుధవారం నాడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు నాగార్జున. ప్రస్తుతం ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉన్న ఏపీ టికెట్ రేట్ ఇష్యూ గురించి స్పందించమని నాగ్ ని కోరగా.. ‘సినిమా స్టేజ్ పై ఉన్నప్పుడు పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను’ అని అన్నారు నాగార్జున.
ఇదే సమయంలో టికెట్ రేట్ ఇష్యూ కారణంగా కమర్షియల్ గా మీ సినిమాపై ఎఫెక్ట్ పడదా..? అని ప్రశ్నించగా.. ‘నాకేం ఇబ్బంది లేదు.. టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే.. కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి.. నా సినిమాకి అయితే అలాంటి ఇబ్బంది లేదు’ అని చెప్పారు. అలానే సంక్రాంతికి వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల గురించి మాట్లాడారు నాగార్జున. ‘వాళ్లు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా రిలీజ్‌కి చాలా ప్లాన్ చేసుకున్నారు..
పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయకతప్పలేదు. అలాగే రాధేశ్యామ్ సినిమా కూడా.. ఎంతో కష్టపడి సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. ఆ సినిమాలు వాయిదా పడటంతో నాకు అడ్వాంటేజ్ వచ్చిందా లేదా? అన్నది సినిమా రిలీజ్ తరువాత చూద్దాం’ అంటూ చెప్పుకొచ్చారు.