ప్రజలకు ఏమన్నా కష్టం వస్తే.. ముందుకొచ్చి సాయం చేసే సెలబ్రిటీల్లో సినిమా వాళ్లే ముందుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కష్టం వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. అలాగే ఇండస్ట్రీలోని మిగిలిన విభాగాలు కూడా ముందుకొస్తుంటాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షాలకు లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు. కొంతమంది కట్టుబట్టలతో మిగిలారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ (Tollywood) పూర్తి స్థాయిలో సాయానికి సిద్ధమైంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఆ కమిటీ ఇచ్చే సమాచారం ప్రకారం సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, దాతలు ఇచ్చే వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఫిల్మ్ ఛాంబర్, కొంతమంది నిర్మాతలు విరాళాలు ప్రకటించారు.
బాధితుల కోసం రెండు రాష్ట్రాలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చెరో రూ.25 లక్షలు ఇవ్వనుంది. తెలుగు నిర్మాతల మండలి చెరో రూ.10 లక్షలు ఇస్తుండగా.. ఫిల్మ్ ఫెడరేషన్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ఇస్తోంది. ఇక దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు రూ. కోటి.. దిల్ రాజు (Dil Raju) ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి విపత్తుల సమయంలో సాయం చేసేందుకు(Tollywood) తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పారు.
ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ చేయూత అందిస్తుంటుంది. అండగా ఉంటుంది. అని నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu) తెలిపారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..మేం ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి అని చెప్పారు. సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ , దిల్ రాజు, భరత్ భూషణ్, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, అనిల్, అమ్మిరాజు, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.