సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు తలనొప్పులు పెరిగాయి. మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. అందుకే స్టార్ హీరోలంతా ఇప్పుడు చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరూ లోకల్ కోర్టుల వైపు చూడటం లేదు, అందరూ దేశ రాజధాని బాట పడుతున్నారు.
మొన్న ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించారు. అసలు మనకు హైదరాబాద్, అమరావతిలో హైకోర్టులు ఉండగా, అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? అనే సందేహం సామాన్యుల్లో కలగడం సహజం. దీని వెనుక లాజిక్ ఉంది.
అసలు విషయం ఏంటంటే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాల ప్రధాన కార్యాలయాలు లేదా వాటి లీగల్ హెడ్ ఆఫీసులు ఢిల్లీలోనే ఉంటాయి. అక్కడి కోర్టు నుంచి ఆర్డర్ వస్తే, దాన్ని అమలు చేయడం ఈ కంపెనీలకు చాలా సులభం, అలాగే వేగంగా జరుగుతుంది. అదే వేరే రాష్ట్రం నుంచి అయితే ప్రాసెస్ కొంచెం లేట్ అవ్వచ్చు.
అంతేకాకుండా, వ్యక్తిగత హక్కుల కేసులను డీల్ చేయడంలో ఢిల్లీ హైకోర్టుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అక్కడ తీర్పులు చాలా వేగంగా వస్తాయి. దేశవ్యాప్తంగా ఆ ఆర్డర్ కు ఉండే పవర్ వేరు. అందుకే మన హీరోలు లోకల్ సెంటిమెంట్ పక్కన పెట్టి, పని జరగడం ముఖ్యం అని ఢిల్లీ రూట్ ఎంచుకుంటున్నారు. ఈ కేసులను వాదించే టాప్ లాయర్లు కూడా అక్కడే అందుబాటులో ఉంటారు.
అయితే కోర్టు కూడా హీరోలకు ఒక విషయం స్పష్టం చేసింది. ఏదైనా తప్పు కనిపిస్తే డైరెక్ట్ గా కోర్టుకు రాకుండా, ముందు ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఫిర్యాదు చేయాలని సూచించింది. వాళ్లు స్పందించకపోతే అప్పుడు కోర్టు చూసుకుంటుందని భరోసా ఇచ్చింది.
