ఎంతటి బంగారు పళ్లానికైనా గోడవార్పు తప్పదు అంటుంటారు. అంటే బంగారు పళ్లమని చెప్పి గోడకు వాల్చకపోతే కిందపడిపోతుంది. సినిమా పరిశ్రమలో బాలీవుడ్‌ని బంగారు పళ్లెంతో పోలిస్తే.. దానికి గోడవార్పు ఇప్పుడు అవసరం అవుతోంది అని చెప్పొచ్చు. మరిక్కడ గోడ ఎవరో తెలుసా? ఇంకెవరు మన టాలీవుడ్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల పరిస్థితి చూస్తుంటే అచ్చంగా ఇలానే ఉంది అని చెప్పొచ్చు. ఈ స్టేట్‌మెంట్ హార్ష్‌గా ఉండొచ్చు కానీ.. బాలీవుడ్ సినిమాలు అందులోనూ పెద్ద హీరోల సినిమాలు టాలీవుడ్ సాయం కోరుకుంటున్నాయి.
ఇటీవల కాలంలో చూస్తే… రణ్‌వీర్ సింగ్ ‘83’ నుండి ఈ తరహా పరిస్థితి మొదలైంది. ఈ సినిమాను తెలుగులో నాగార్జున సమర్పించారు. తెలుగు రిలీజ్ వరకు అన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ చూసుకుంది అని అంటారు. ఆ తర్వాతి స్థానం ‘బ్రహ్మాస్త్రం’ గురించి చెప్పాలి. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిరంజీవి సమర్పణలో విడుదలవుతోంది. ఇక సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాళీ’లో తెలుగులో సురేష్ బాబు రిలీజ్ చేస్తారని అంటున్నారు.
ఒకప్పుడు బాలీవుడ్‌లో రూపొందే ప్రతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యేది. డబ్బింగ్ చేసి మరీ విడుదల చేసేవారు. వారాల తరబడి ఆ సినిమాలు ఇక్కడ ఆడేవి. రాను రాను ఆ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎప్పుడో కానీ సినిమాఇ వచ్చేది కాదు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా అంటూ మన సినిమాలు బాలీవుడ్ వెళ్తున్నాయి. దీంతో అక్కడి సినిమాలు ఇక్కడ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే నేరుగా వస్తే ఇబ్బందులు వస్తాయేమో అని ఇక్కడి స్టార్ హీరోలను, దర్శకులను సమర్పకులుగా తీసుకుంటున్నారు.
ఇలా ఆఖరున యాడ్ అయిన టాలీవుడ్ పెద్దలు సినిమా కోసం డబ్బులు ఖర్చు పెట్టేది ఏమీ ఉండదని సమాచారం. సినిమా ప్రచారంలో ఉపయుక్తంగా ఉంటారు. అలాగే ఇంటర్వ్యూల్లో చెప్పడానికి భారీగా ఉంటుందని ఆలోచనట. తెలుగు వారిని ఆకట్టుకోవడానికి ఇదో రకమైన ప్లాన్ అంటున్నారు. చూద్దాం ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.