ప్రజా సమస్యలు, విప్లవ పోరాటం కథాంశాలతో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘మా భూమి’, ‘యువతరం కదిలింది’, ‘ఎర్ర సైన్యం’,’ఒరేయ్ రిక్షా’, ‘ఒసేయ్ రాములమ్మ’, ‘శ్రీరాములయ్య’.. ఇలా లెక్కేసుకుంటూ పోతే లిస్ట్ కూడా పెద్దదే.వాటిలో ఎన్నో చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.ఇలాంటి సినిమాలకు ‘కేర్ ఆఫ్ అడ్రెస్’ గా మారి ‘పీపుల్స్ స్టార్’ గా ఎదిగాడు ఆర్.నారాయణమూర్తి. ఈ జోనర్ సినిమాలకు డిమాండ్ ఉందని ప్రూవ్ చేసింది కూడా ఈయనే.అయితే తరువాత కమర్షియల్ సినిమాల ఎంట్రీ వల్ల వీటి జోరు తగ్గింది. దాంతో ఇలాంటి సినిమాలకు ఆదరణ బాగా తగ్గింది అని అనుకున్నారంతా.
అయితే మధ్య మధ్యలో ‘సింధూరం’ తో కృష్ణవంశీ, ‘జల్సా’తో త్రివిక్రమ్, ‘గమ్యం’ తో క్రిష్, ‘143’ తో పూరిజగన్నాథ్ వంటి అగ్ర దర్శకులు ఈ జోనర్ ను టచ్ చేశారు. తరువాత ఎవ్వరూ ఇలాంటి సినిమాలు చెయ్యలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి, రాంచరణ్, ఎన్టీఆర్, రానా స్టార్ హీరోలు మళ్ళీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘ఆచార్య’ చిత్రం నక్సలిజం బ్యాక్‌డ్రాప్ తోనే రూపొందనుందని ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ను బట్టి స్పష్టమవుతుంది. ఈ చిత్రంలో చరణ్ కూడా ఓ మాజీ నక్సలైట్‌గానే కనిపించబోతున్నాడు.
‘విరాటపర్వం’ చిత్రంలో కూడా రానా – సాయి పల్లవి, ప్రియమణి వంటి వారు నక్సలైట్లు గా కనిపించబోతున్నారు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కూడా… విప్లవ వీరులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చరణ్… అల్లూరి సీతారామరాజుగా అలాగే ఎన్టీఆర్..కొమరం భీమ్ గా కనిపించబోతున్న ఈ చిత్రం 2021 చివర్లో విడుదల కాబోతుంది.