నటీనటులు అన్ని రకాల పాత్రలు పోషించాలి. ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకోవాలి. అయితే దేవుళ్లుగా నటించాలంటే మాత్రం సాహసంతో కూడిన విషయం. అందుకే ఆ తరహా కథల జోలికి వెళ్లరు. అతి తక్కువమంది మాత్రమే దేవుళ్లుగా నటించి మెప్పుపొందారు. శ్రీరాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలపై ఫోకస్..
హరనాథ్
నందమూరి తారకరామారావు రావణుడిగా నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాలో తొలి తరం కథానాయకుడు హరినాథ్ శ్రీరాముడిగా నటించి నీరాజనాలు అందుకున్నారు. ఇందులోని “సీతారాముల కళ్యాణం చూత్తాము రారండి” .. అని సుశీల పాడిన పాట బాగా పాపులర్ అయింది.
ఎన్టీఆర్
1960 – 70 మధ్య కాలంలో తెలుగు ప్రజల్లో చాలామంది ఎన్టీఆర్ రాముడిగా నటించిన పోస్టర్ ని దేవుడు పటం లా భావించి పూజించారు. అంతలా ఆయన నటించిన లవకుశ సినిమా ప్రభావం చూపింది. లవకుశ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటన అమోఘం. సీతగా అంజలి దేవి బాగా సెట్ అయ్యారు. ఇప్పటికీ, ఎప్పటికీ..వారిద్దరే టాలీవుడ్ కి అచ్చమైన సీతారాములు.
శోభన్ బాబు
సోగ్గాడు శోభన్ బాబు కుటుంబ కథా చిత్రాలతో పాటు మైథలాజికల్ మూవీస్ కూడా చేశారు. సంపూర్ణ రామాయణం సినిమాలో ఆయన రాముడిగా, సీతగా చంద్రకళ నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్
మహానటుడు ఎన్టీఆర్ మనవడు తారక్ తొలుత వెండితెరపై రాముడి పాత్రతోనే అడుగుపెట్టారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో శ్రీరాముడిగా చిన్న వయసులోనే ఎన్టీఆర్ అద్భుత నటన ప్రదర్శించారు.
బాలకృష్ణ
అనేక సార్లు రామాయణం వెండితెరపై వచ్చినప్పటికీ నమదమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన శ్రీ రామరాజ్యం సినిమాను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. ఇందులో రామయ్యగా బాలయ్య చక్కగా నటించి మహానటుడు నందమూరి తారకరామారావు లేని లోటుని తీర్చారు.
సుమన్ – శ్రీరామదాసు
కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో నాగార్జున హీరోగా వచ్చిన భక్తిరస చిత్రం శ్రీరామదాసు లో సీనియర్ హీరో సుమన్ రాముడి పాత్రలో కనిపించాడు.
శ్రీకాంత్ – దేవుళ్ళు
కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన దేవుళ్ళు చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ కాసేపు శ్రీరాముడి గా కనిపించాడు.