టాలీవుడ్‌లో (Tollywood) ఆదాయపన్ను శాఖ దాడులు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి బడా నిర్మాతలు, నిర్మాణ సంస్థలతో పాటు వారి లావాదేవీల వెనుక ఉన్న ఫైనాన్షియర్లపై కూడా దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా ఫైనాన్షియర్ సత్య రంగయ్య పేరు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన పేరు పెద్దగా బయట వినిపించకపోయినా, పరిశ్రమలో ఆయన ఒక కీలక వ్యక్తిగా పేరు పొందారు. ధర్మవరం, అనంతపురం జిల్లాకు చెందిన ఈ వ్యక్తి దశాబ్దాలుగా పెద్ద సినిమాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
Tollywood
సత్య రంగయ్య ఫైనాన్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ (Sr NTR), ఏఎన్ఆర్ (ANR) కాలం నుండి ఇప్పటి వరకు పెద్ద నిర్మాణ సంస్థలతో ఆయన లావాదేవీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు (Dil Raju) , మైత్రి మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ వంటి సంస్థలకు సుమారు 2.25% వడ్డీతో ఫైనాన్స్ అందించడం ఆయన ప్రత్యేకత. ఇండస్ట్రీలో 5 రూపాయలు నుంచి 10 రూపాయల వడ్డీకి ఇచ్చే వారు కూడా ఉన్నారు. కానీ దాదాపు అందరి కంటే తక్కువ వడ్డీ ఈయనే ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని ఆయన కుమారుడు ఎంఎస్ఆర్ ప్రసాద్ ముందుకు తీసుకెళ్తున్నారు. పెద్ద బడ్జెట్ చిత్రాలకు అత్యవసర సమయాల్లో అవసరమైన ఫైనాన్స్ అందించడంలో రంగయ్య పేరు పరిశ్రమలో అగ్రగామిగా నిలిచింది. గతంలో ల్యాబ్ లెటర్స్ ద్వారా ఫైనాన్స్ లావాదేవీలు జరిగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ అగ్రిమెంట్‌లు, హిందీ మార్కెట్ డీల్‌లు ప్రధాన ఆధారాలుగా మారాయి. ఇవి పక్కన పెట్టి, దర్శకనిర్మాతల ఆర్థిక స్థితిని పరిశీలించి, వారి బ్యాంకింగ్ వివరాలు పరిశీలించిన తరువాతే ఫైనాన్స్ అందించడం జరుగుతోంది.
ఈ ప్రాసెస్‌తో టాలీవుడ్‌లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ (Game Changer), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). వంటి పెద్ద సినిమాలకు సత్య రంగయ్య కీలక ఫైనాన్స్ అందించినట్లు సమాచారం. అయితే, ఈ లావాదేవీల పట్ల ఆదాయపన్ను శాఖ తీవ్ర విచారణ జరుపుతోంది. క్యాష్ లావాదేవీలు జరిగినాయా? పన్ను చెల్లింపులు సరిగ్గా జరిగాయా? అనే కోణంలో ఐటీ అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.