నెటిజన్లు, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే.. సినిమా జనాల ధైర్యమే దెబ్బతింటుంది. ఇప్పటికే మనం చాలాసార్లు, చాలామంది విషయంలో పై కాన్సెప్ట్ చూశాం కూడా. లేనిపోని చర్చ ఎందుకు అని అనుకోవడమో, లేక ఇప్పటికి జరిగింది చాలు ఇంకా వద్దు అనుకోవడం వల్లనో సినిమా జనాలు కాస్త వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు నయనతార కూడా ఇదే ఆలోచనతో ఓ సినిమా వదిలేసుకుందా? ఏమో కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అలానే అనిపిస్తోంది.
‘అమ్మోరు తల్లి’ అనే సినిమాతో నాలుగేళ్ల క్రితం నయనతార ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాను ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించాడు. దాంతోపాటు కీలక పాత్రలో కూడా నటించి మెప్పించాడు. ఇప్పుడు ఆయన ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిందట. ఈ క్రమంలో ప్రధాన పాత్రధారి చర్చ జరుగుతోందట. దీంతో ఎవరా నాయిక అనే విషయం ఒకటి బయటికొచ్చింది.
నయనతార (Nayanthara) పోషించిన పాత్రను త్రిష (Trisha Krishnan) ఇప్పుడు చేస్తుంది అని అంటున్నారు. అంటే అమ్మోరు తల్లిగా నయన్ బదులు త్రిష కనిపిస్తుందట. మంచి కథాంశం, సందేశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది అని త్రిష సన్నిహితుల దగ్గర చెప్పింది అని సమాచారం. అయితే నయనతారను ఈ పాత్ర కోసం సంప్రదించలేదా? లేక సంప్రదిస్తే ఆమె నో చెప్పిందా అనేది తెలియాల్సి ఉంది. నెటిజన్లు అయితే రెండోదే కరెక్ట్ అని అంటున్నారు.
నయనతార చేతిలో ఇప్పుడు వరుస సినిమాలు కూడా లేవని, అయితే ‘అన్నపూర్ణి’ (Annapoorani) సినిమా సమయంలో వచ్చిన విమర్శలు, వివాదాల కారణంగా ఇకపై అలాంటి సినిమాలు వద్దు అని నయన్ అనుకోవడమే త్రిష ఎంట్రీకి కారణం అని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక త్రిష సంగతి చూస్తే.. ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) , కమల్ హాసన్ (Kamal Haasan) ‘థగ్‌లైఫ్’ (Thug Life) చిత్రాలతోపాటు ‘ఐడెంటిటీ’, ‘రామ్’ లాంటి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.