పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న కథ “కోబలి”. రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు సంబంధించిన కథను పవన్ కోసం రాసుకున్నానని త్రివిక్రమ్ చెప్పినప్పటినుంచి ఎప్పుడు తెరకెక్కుతుందా? అని ఎదురుచూసారు. అయితే పవన్ జనసేన పార్టీ పెట్టడం, ప్రజల్లోకి వెళ్లడంతో అది ఆగిపోయింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో రాయలసీమ నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తుండడంతో అది కోబలి కథ అని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని మాటల మాంత్రికుడి ముందు ఉంచగా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. “కోబలి కథ వేరు. అరవింద సమేత వీర రాఘవ వేరు. రెండింటికీ సంబంధం లేదు. కోబలి పూర్తిగా ఆఫ్ బీట్ చిత్రం.
పాటలు, ఫైట్స్ లేకుండా, ప్రయోగాత్మకంగా తీద్దామనుకున్నాము. అరవింద ఓ కమర్షియల్ చిత్రం. దాన్ని ఆ కోణంలోనే చూడాలి” అని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల తర్వాత పవన్ తో త్రివిక్రమ్ “కోబలి” చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నట్టు అర్ధమవుతోంది. కమర్షియల్ హంగులకు దూరంగా సినిమా తీస్తే.. సినిమా హిట్ అవుతుందా? పవన్ అభిమానులకు నచ్చుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ మూవీ గురించి పక్కన పడితే.. ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత… ఎలా ఉందో కొన్ని గంటల్లో తెలియనుంది.