అందరి హీరోలకు కెరీర్ బెస్ట్ సినిమాలు ఇస్తున్న అనిల్ రావిపూడి..!

అదేంటి సంక్రాంతి విన్నర్ మన గురూజీ త్రివిక్రమ్ అయితే అనిల్ రావిపూడి బెటర్ అంటున్నాడు ఏంటి? అని కంగారు పడకండి..! బాక్సాఫీస్ లెక్కల ప్రకారం అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ కంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎక్కువ కలెక్షన్స్ ను రాబడుతుంది.. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ అనిల్ రావిపూడి బెటర్ అంటున్న సంగతి వేరు. ‘జబర్దస్త్’ లాంటి కామెడీ షోలు బుల్లితెర పై ఏలుతున్న రోజులివి. దీంతో వినాయక్, శ్రీను వైట్ల వంటి డైరెక్టర్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఇప్పటి రోజుల్లో సినిమాల్లో కామెడీ కోసం జనాలు థియేటర్లకు రావడం మానేశారు.

ఒకప్పుడు తన పంచ్ డైలాగ్స్ తో మంచి కామెడీని పండించిన మన గురూజీ.. శ్రీనివాస్ త్రివిక్రమ్ ఇప్పుడు ఆ స్థాయిలో కామెడీని పండించలేకపోతున్నాడు. బహుశా త్రివిక్రమ్ బ్రాండ్ కమెడియన్స్ అయిన ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మల్లికార్జున రావు వంటి వారు చనిపోవడం వలన.. అలాగే త్రివిక్రమ్ స్నేహితుడు అయిన సునీల్ ఫామ్లో లేక పోవడం వలన అనుకుంట.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కామెడీ కంటే ఎక్కువ.. ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చాడు మన గురూజీ. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ప్రధాన బలం తమన్ అందించిన మ్యూజిక్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో కొన్ని కామెడీ సీన్లు చూస్తే గురూజీ పని అయిపొయింది అనే ఫీలింగ్ కలుగక మానదు.

ఇక మన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే మాత్రం.. ట్రెండీ కామెడీని అందిస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ట్రైన్ కామెడీ కొంతమంది విసుగు పుట్టించింది. కానీ ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఆ ట్రైన్ కామెడీని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బహుశా వాళ్ళనే అనిల్ రావిపూడి టార్గెట్ చేసాడేమో. సరే ఆ ట్రాక్ ను పక్కన పెడితే ‘నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ ‘కూజాలు చెబులైపోతాయి’ వంటి ఊత పదాలతో కామెడీ బాగా పండింది. ముఖ్యంగా ‘రామణా లోడెత్తాలి రా.. చెక్ పోస్ట్ పడతాది’ అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. అంతేకాదు టాలీవుడ్ లో మిలిటరీ నేపథ్యంలో వచ్చే సినిమాలకు కూడా ఆదరణ తగ్గిపోయింది అనే సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసాడు అనిల్ రావిపూడి.

ఇప్పటి ఆడియన్స్ కావాల్సిన కామెడీని అనిల్ రావిపూడి అందిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. అలాగే ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి వర్క్ చేసిన హీరోలందరికీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లను అందించాడు. అనిల్ రావిపూడి మొదటి చిత్రం అయిన ‘పటాస్’.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం. ఇక సాయి తేజ్ కు ‘ప్రతీరోజు పండగే’ సినిమా ముందు వరకూ బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం ‘సుప్రీమ్’. ఇక రవితేజ కు ‘రాజా ది గ్రేట్’ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి కెరీర్ హైయెస్ట్ అదే. ఇక ఇప్పుడు మహేష్ బాబుకు కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ కెరీర్ బెస్ట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. కానీ ఇప్పటి వరకూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.. దిల్ రాజు ఫ్యాక్టరీ లో ఉండి సినిమాలు చేస్తున్నాడు కాబట్టి.. అనిల్ కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాడు.. మరి వేరే నిర్మాతతో సినిమా చేస్తే ఇదే ట్రాక్ రికార్డు.. కంటిన్యూ చేస్తాడా అనేది కూడా ఓ అనుమానమే..!

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus