నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Thandel) సినిమా మొదటి నుంచే మంచి పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది. పాటలు సూపర్ హిట్ కాగా, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కంటెంట్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవడంతో విడుదలైన వెంటనే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, మౌత్ టాక్ సినిమాకు మరింత ఊపునిచ్చింది. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా మరోసారి మెప్పించడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమా బజ్ ఎంతున్నా.. యూఎస్ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది.
యూఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ గత కొన్నేళ్లుగా భారీగా పెరిగింది. ముఖ్యంగా ప్రీమియర్ షోల ద్వారా మంచి వసూళ్లు రావడం ట్రెండ్‌గా మారింది. అయితే, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ ఈ సినిమాకు సమస్యగా మారిందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. జనవరి 21న ప్రకటించిన కొత్త వలస విధానాల ప్రకారం, అనుమతించిన సమయాలకు మించి పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న భారత విద్యార్థులపై అక్కడి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితిని పరిశీలిస్తే, ఈ వలస విధానం ప్రభావం తండేల్ సినిమాపై స్పష్టంగా కనిపిస్తోంది.
ట్రంప్ పాలసీ ప్రకారం, అనధికారికంగా ఎక్కువ సమయం పని చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల చాలా మంది తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి అధిక ధరల టికెట్లు కొనుగోలు చేయడంపై వారిలో వెనుకంజ కనిపిస్తోంది. గతంలో తెలుగు విద్యార్థులు ప్రీమియర్ షోలకే అధిక సంఖ్యలో హాజరై వసూళ్లు పెంచారు. కానీ ప్రస్తుతం తండేల్ ప్రీమియర్ షోలు యావరేజ్ ఓపెనింగ్స్‌తో మాత్రమే మొదలయ్యాయి. వీకెండ్‌లో కూడా ఆశించిన వృద్ధి కనిపించలేదు. ఇప్పటి వరకు తండేల్ యూఎస్‌లో $700K+ మాత్రమే రాబట్టింది.
సాధారణంగా ఇంత మంచి టాక్ వచ్చిన సినిమాకు వసూళ్లు మరింత ఉండాలి. కానీ ఈ ఫిగర్ పరంగా చూస్తే యావరేజ్ అని చెప్పాల్సిందే. ట్రంప్ పాలసీ వల్ల విద్యార్థుల్లో ఏర్పడిన ఆందోళన కారణంగా థియేటర్లకు వచ్చే సంఖ్య తగ్గిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రీమియర్ షోలకు ఎక్కువ ధరలు పెట్టడం వల్ల కూడా కొన్ని సినిమాలకు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ తండేల్ విషయంలో మేకర్స్ రెగ్యులర్ టికెట్ రేట్స్‌ను అనుసరించారు. ఇది కేవలం తండేల్ సినిమాపైనే కాకుండా, రాబోయే తెలుగు సినిమాలపై కూడా ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్న అందరిలో కలుగుతోంది.