70 వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా ఈరోజు విడుదలైంది. ఈసారి ఎవ్వరూ ఊహించని సినిమాలకు అవార్డులు వచ్చాయి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ‘ఆట్టం’ (Aattam) అనే సినిమాకి నేషనల్ అవార్డు లభించింది. అసలు ఈ సినిమా ఒకటి ఉంది అనే విషయం ఇప్పటివరకు సినీ ప్రేమికులకు తెలీదు అంటే.. అతిశయోక్తి లేదు. కానీ నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది ‘ఆట్టం’ సినిమా..! మలయాళంలో రూపొందిన ఈ సినిమా 2024 జనవరి 5న రిలీజ్ అయ్యింది.
అయితే 2023 అక్టోబర్ 13 న ‘ఐఎఫ్ఎఫ్ఎల్ఏ'(ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్) లో ప్రదర్శింపబడింది. అలాగే 54వ ‘ఐఎఫ్ఎఫ్ఐ’ (ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) అవార్డులు సైతం కైవసం చేసుకుంది. ఈ సినిమా 2022 లోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘ఆట్టం’ (Aattam) కథ.. కేరళలో ఉండే ఓ నాటక బృందంలోని 12 మంది నటీనటుల చుట్టూ తిరుగుతుంది. అందులో ఓ నటితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు.
అలా అసభ్యకరమైన పని చేసిన ఆ వ్యక్తి…తర్వాత ఏమయ్యాడు? అతని వల్ల ఆ నటికి, ఆమె మనుషులకు ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి అనేది మిగిలిన కథ. మెయిన్ గా మనుషుల్లో ఉండే చీకటి కోణాలు… ‘వ్యక్తిత్వం కావచ్చు, జీవనోపాధి కోసం దిగజారడాలు కావచ్చు, ఎదుటివారిని బలిపశువు చేయడం కావచ్చు..’ అలాంటి అంశాలను ఈ కథలో చర్చించినట్టు స్పష్టమవుతుంది. అందుకే ఈ సినిమాకి అవార్డుల పంట పండింది అని చెప్పుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. చూడాలనుకుంటే చూడండి.