‘నీకోసం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీనువైట్ల. అది డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఫలితంగా ‘ఉషాకిరణ్ మూవీస్’ రామోజీరావు తన బ్యానర్లో ఓ సినిమా చేసే ఛాన్స్ శ్రీను వైట్లకి ఇచ్చారు. అదే టైంలో ఓ కథ రాసుకున్నాడు శ్రీను వైట్ల. అదే ‘ఆనందమానందమాయే’. కానీ ఈ కథను పూర్తిగా డెవలప్ చేయలేకపోవడంతో దానిని పక్కన పెట్టి.. ‘ఆనందం’ అనే యూత్ ఫుల్ మూవీని తీశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.
తర్వాత ఇదే బ్యానర్లో మరో సినిమా చేస్తానని దర్శకుడు శ్రీను వైట్ల ‘ఆనందం’ సినిమా చేయడానికి ముందే అగ్రిమెంట్ పై సైన్ చేశారు. మధ్యలో ‘సొంతం’ అనే సినిమా చేసుకుని వచ్చారు. అది సో సో గా ఆడింది. ఇక అగ్రిమెంట్ ప్రకారం.. రామోజీరావు గారికి ఇంకో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. తాను సగం డెవలప్ చేసుకున్న కథ ‘ఆనందమానందమాయే’ రామోజీరావు కి వినిపించగా.. ఆయనకు కథ నచ్చేసింది ఓకే చెప్పేశారు.
కేవలం 65 రోజుల్లోనే సినిమాని కంప్లీట్ 2004 ఫిబ్రవరి 6న రిలీజ్ చేశారు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.కొన్ని కామెడీ సీన్లు బాగున్నాయి అన్నారు.కోటి సంగీతంలో రూపొందిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. జె డి చక్రవర్తి ట్రాక్ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. బలవంతంగా ఇరికించినట్టుగా ఉంది. ఇక డ్రై సీజన్ కావడంతో జనాలు థియేటర్ కు వెళ్లి ఈ సినిమాని చూసింది లేదు. వీకెండ్ కే సినిమా డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయింది.
‘ఆనందం’ కాంబినేషన్లో ఇలాంటి డిజాస్టర్ సినిమా కూడా వచ్చింది అని చాలా మందికి తెలిసుండకపోవచ్చు.కేవలం అగ్రిమెంట్ కోసమనే కంగారుగా దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాని తీసినట్టు ఉంది. ఈటీవీలో ఈ సినిమా ప్రసారమయ్యేప్పుడు చాలా మంది ‘ఆనందం’ కాంబినేషన్లో ఈ సినిమా ఎప్పుడు వచ్చిందా అని ఆశ్చర్య పోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజుతో 19 ఏళ్ళు పూర్తయ్యింది.