విక్టరీ వెంకటేష్.. ఫస్ట్ డేనే లేడీస్‌ని కూడా థియేటర్లకు రప్పించగల స్టార్ డమ్ ఆయన సొంతం.. తన జెనరేషన్ హీరోల్లో ఎక్కువ మహిళా అభిమానులు కలిగిన హీరో.. కెరీర్ స్టార్టింగ్‌లో అందరిలానే లవ్, మాస్, కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. ‘ప్రేమ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి సూపర్ హిట్స్.. ‘స్వర్ణకమలం’ లాంటి క్లాసిక్స్, ‘బొబ్బిలి రాజా’ లాంటి బ్లాక్ బస్టర్, ‘క్షణ క్షణం’, ‘చంటి’ లాంటి డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ క్యారెక్టర్లతో ప్రేక్షకాభిమానులను అలరించారు వెంకీ..
ముఖ్యంగా వెంకీ చేసిన ఫ్యామిలీ సినిమాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. తెరమీద సన్నివేశం చూస్తూ.. హాళ్లల్లో ఆడాళ్లు తమ పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకున్నారంటే.. ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టు లెక్కే.. అలా వారిని అలరించడానికి ఎన్నో కుటుంబ కథా చిత్రాలు చేశారు.. ‘సుందరకాండ’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రాలు అయితే ఎవర్ గ్రీన్..
‘పవిత్రబంధం’ విషయానికొస్తే.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటుంది.. విజయ్, రాధ పాత్రల్లో వెంకీ, సౌందర్య జీవించేశారు. సినిమా చూసేటప్పుడు ఎమోషనల్ అవ్వని వారుండరు.. పెళ్లికి ముందు అగ్రిమెంట్ చేసుకోవడం అనే పాయింట్ అప్పట్లో సెన్సేషన్.. ఇక ఫస్ట్ నైట్ సీన్‌లో సౌందర్య, వెంకటేష్ కాళ్లకు నమస్కారం పెడుతుంది..
వెంకీ : ఇదేంటి.. కాళ్ల మీద పడ్డావ్?
సౌందర్య : ఆశీర్వదించమని..
వెంకీ : ఆశీర్వదించాల్సింది.. పెద్దలు, దేవుళ్లు..
సౌందర్య : పతి కూడా ప్రత్యక్ష దైవమే కదండీ.. ఈరోజు నుంచి నాకు అన్నీ మీరే.. అనగానే .. వెంకటేష్ తిరిగి సౌందర్య కాళ్లు మొక్కుతాడు.. ‘నువ్వు నా కాళ్లకి దణ్ణం పెడితే తప్పు లేనప్పుడు.. నేను నీ కాళ్లకి దణ్ణం పెడితే తప్పేముంది?.. భర్తలకి ఏమైనా ఎక్సట్రాలుంటాయా?’ అని ప్రశ్నిస్తాడు.. ఎప్పుడైతే వెంకీ, సౌందర్య కాళ్లకి నమస్కారం చేస్తాడో.. ఊహించని ఈ సన్నివేశానికి.. దెబ్బకి థియేటర్లు దద్దరిల్లిపోయాయ్.. భార్యభర్తలిద్దరూ సరి సమానం (ఫ్రెండ్స్‌లా ఉండాలి) అని చాటిచెప్పే ఈ సీన్ చూసి లేడీ అభిమానులంతా కంటతడి పెట్టేవారు..
ఇక ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ పాటప్పుడైతే నాన్‌స్టాప్‌గా కంటతడి పెడుతుండేవారు.. అంతగా ప్రేక్షకాభిమానుల హృదయాలను హత్తుకున్న సినిమా ‘పవిత్రబంధం’.. ఇప్పుడు చూసినా కానీ.. ఇలాంటి సీన్స్ చేయడం వెంకీ, సౌందర్యకే సాధ్యమనిపిస్తుంది.. భూపతి రాజా కథ ఇవ్వగా.. పోసాని కృష్ణ మురళి డైలాగ్స్ రాశారు.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో.. గీత చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ మీద సి.వెంకటరాజు, జి.శివరాజు నిర్మించగా.. కీరవాణి సంగీతమందించారు..