ప్రపంచమంతా, ముఖ్యంగా భారతదేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక 95వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం సోమవారం (మార్చి 13) తెల్లవారు ఝామున అట్టహాసంగా జరిగింది.. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. ఈ సంవత్సరం మన దేశం నుంచి ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే..
2023 ఆస్కార్ వేడుక ప్రారంభంలోనే ఓ ఇండియన్ మూవీ ఖాతా తెరిచింది.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అకాడమీ అవార్డ్ గెలుచుకుంది.. ఏనుగులు, వాటితో మనిషికున్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అవార్డు సాధించడం విశేషం. ఓ అనాథ ఏనుగు పిల్ల, దానిని ఆదరించిన దంపతుల కథతో సుమారు 42 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ షార్ట్ ఫిలిం.. తాజాగా ఆస్కార్స్‌లో కూడా సత్తా చాటింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కార్తికి గొన్సాల్వేస్ అనే యువతి దర్శకత్వం వహించగా.. గునీత్ మోంగా నిర్మించారు..
కార్తికి గొన్సాల్వేస్ నేపథ్యం..
36 సంవత్సరాల కార్తికి గొన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఫస్ట్ ఫిలిం ఇది.. మొదట ఆమె తన తండ్రిలానే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నారు.. దాని కోసమే విజువల్ కమ్యునికేషన్‌లో డిగ్రీ, ఫోటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్‌లో పీజీ చేశారు.. తర్వాత ప్రకృతి, దాని చుట్టూ జీవనంపై ఫోకస్ పెట్టారు.. తన ప్యాషన్ కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆస్కార్ వరకు కొనసాగిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం.. ‘‘నేను మహిళలు, గిరిజన తెగలు, ప్రకృతి, మూగజీవాల గొంతుక అవ్వాలనుకున్నా.. అందుకు నేను ఎంచుకున్న మార్గం ఫోటోగ్రఫీ.. ప్రజల్లో మార్పు తేవడానికి నాకు కనిపించిన అత్యంత ప్రభావవంతమైన ఆయుధమిది’’ అని చెప్పారు కార్తికి..
కథ ఏంటంటే..
అనాథ ఏనుగు పిల్లతో ఓ దంపతులకు ముడిపడిన బంధాన్ని ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ అందంగా, అద్భుతంగా ఆవిష్కరించింది. ఆ దంపతులు మనుషులతో సంభాషించినట్టుగానే ఏనుగుతోనూ మాట్లాడటం.. అది కూడా వాళ్ల భావాల్ని అర్థం చేసుకుని చెప్పినట్టు వినడం.. ఇలా ఈ మూవీలోని ప్రతిఘట్టం అపురూపమే. పిల్లలులేని ఆ ఇంట ఏనుగు పిల్లే పసిబిడ్డ అవుతుంది. దాని కోసం ఆ దంపతులు వారి జీవనశైలిని కూడా మార్చుకుంటారు. ప్రకృతి, జంతువులతో మనుషులే మమేకమవడం, విడదీయరాని బంధం ఏర్పరచుకోవడం గురించే ఈ కథ..
నిజంగా జరిగిన కథే.
తాను చూసిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఆలోచన వచ్చింది అని తెలిపారు కార్తికి. సుమారు అయిదేళ్ల క్రితం.. కార్తికి ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం గమనించింది. వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఆమెను ఆశ్చర్యపరిచింది. వారి కథ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ వ్యక్తితో మాట కలిపితే ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడించాడు.. తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసి పెంచుకున్నట్లు తెలిపాడు. ఆ సంఘటన కార్తికి కెరియర్‌ను మలుపు తిప్పింది. ఆ వ్యక్తి మాటల్లోంచి పుట్టుకొచ్చిందే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథ..
ఈ సందర్భంగా కార్తికి మాట్లాడుతూ.. ‘‘నా సినిమాలో ఉన్న దంపతులిద్దరూ ఆ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్నారు. ఏనుగు పిల్లతో ఆ దంపతులకున్న అనుబంధాన్నే కథగా తీశా. హడావుడి కథగా ముగించడం నాకు ఇష్టం లేదు. వారి మధ్య చోటు చేసుకునే అన్ని రకాల భావోద్వేగాలను చూపించాలి. కెమెరా లేదన్న భావన కలిగించినప్పుడే అది సాధ్యం. దానికోసం నేను ముందు 18 నెలలు పాటు వాళ్లతో అనుబంధం పెంచుకున్నా. మిగతా సమయమంతా ఏనుగులు, వాళ్ల మధ్య సహజ సాన్నిహిత్యాన్ని షూట్ చేశాం. అందుకే 450 గంటల ఫుటేజీ వచ్చింది. ఈ సమయంలోనే ఆ దంపతులు పెళ్లి చేసుకున్నారు. అలా కట్టునాయకన్ తెగ సంస్కృతినీ తెలియజేసే అవకాశం వచ్చింది’’ అన్నారు.. 36 ఏళ్ల కార్తికికి మొదటి సినిమాకే ఆస్కార్ రావడం గొప్ప అంటే ఎంతో గొప్ప విశేషం.. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత గునీత్ మోంగా కూడా మహిళే కావడం.. ఇద్దరూ కలిసి ఆస్కార్ అందుకోవడం మంచి అనుభూతి అని చెప్పాలి..