1977… ఈ సంవత్సరం ఎన్‌టీయార్ సినీ కెరీర్ లో ఒక మైలురాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే బాక్సాఫీసు బీజాలు కదిలిపోయేలా ఒకదానిని మించి మరొక సినిమా మొత్తం మూడు సినిమాలు తీసాడు. ఆ మూడింటిలో ఒక చిత్రమే అడవి రాముడు.వేటకు బయలుదేరిన సింహం వేసిన మొదటి వేటు.. ‘బాక్సాఫీసు అమ్మ మొగుడు’ అని మనాళ్లు రాసుకునే విశేషణాలన్నీ ‘అడవి రాముడు’ సినిమానుంచే మొదలై ఉంటాయి… ‘అడవిరాముడు సినిమా ఆఫర్ నాకొచ్చినప్పుడు నేనెంత భయపడ్డానో.. ఎలా ప్రెజెంట్ చేయాలి..
కొత్తగా చెప్పడానికి ఏముంది ఈయన్ని..’ అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కంగారు పడిపోయారు. నిజమే.. తెరమీద దైవత్వాన్ని సంతకంగా గీసిపారేసిన నటుణ్ణి.. ఆరుకోట్లమంది ఆంధ్రుల మనసుల్లో చేతి కదలిక, చెప్పబోయే మాట.. నవ్వు, రూపురేఖలన్నీ స్పష్టంగా ముద్రించుకుని ఉన్న అభిమాన కథానాయకుడిని ఎలా పరిచయం చేయాలి. కానీ దర్శకేంద్రుడు చేసాడు కమ్యూనిజనికి కమర్షియల్ హంగులు అద్ది ఒక కొత్త కమర్షియల్ ఫార్ములా సృష్టించాడు. రిటైరయిపోతాడా ఎన్‌టీయారు అని భయపడుతున్నవాళ్లందరికీ అడవిరాముడు ఒక గొప్ప ఊరట. ఇటువంటి అడవి రాముడి చిత్రం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు…
1) కన్నడ దిగ్గజ నటుడు రాజుకుమార్ గంధడా గుడి చిత్రాన్ని ప్రేరణగా తీసుకొని అడవి రాముడు కథని తీర్చిదిద్దారు.
2) మొదటి సారి ఎన్టీఆర్ సినీ కెరీర్లో మద్రాస్ దాటి 30 రోజులు పైగా షూటింగ్ చెయ్యడం ఈ సినిమాకే. షూటింగ్ మొత్తం మధుమలై ఫారెస్టులో జరిగింది.
3) సినిమాస్కోప్ లో ఎన్టీఆర్ మొదటి కలర్ చిత్రం అడవి రాముడు.
4) ఈ చిత్రం కోసం సినిమాస్కోప్ కి వాడే లెన్స్ ని జపాన్ నుంచి తెప్పించారు.
5) ఈ చిత్ర షూటింగ్లో జయసుధకి మరియు జయప్రదకి కొన్ని మైనర్ ఆక్సిడెంట్స్ జరిగాయి.
6) మూడు కోట్లకి పైగా కలెక్ట్ చేసిన మొట్ట మొదట తెలుగు చిత్రం.
7) 50 రోజుల్లో 83 లక్షలు, 67 రోజులకే 1 కోటి కలెక్ట్ చేసిన మొదటి చిత్రం ఇదే.
8) 100 రోజులు 30 సెంటర్లు – 175 రోజులు 16 సెంటర్లు అప్పట్లో ఆల్ టైం రికార్డ్ ఇది.
9) నైజాంలో 100 రోజులు 6 సెంటర్లో కంప్లీట్ చేసుకున్న మొదటి చిత్రం.
10) కనక మహల్, నెల్లూరు థియేటర్లో 102 రోజులు రోజుకి 5 షోలు హౌజ్-ఫుల్తో ఆడిన మొదటి చిత్రం ఇదే.
11) 4 సెంటర్లో 365 రోజులు ఆడిన మొదటి చిత్రం.
12) కాకినాడ దేవి 70 mm థియేటర్లో 254 రోజులు ఆడి అప్పట్లో రికార్డ్ సృష్టించింది.
13) అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ లోని అతిపెద్ద థియేటర్ అయిన వేంకటేశ లో 47 రోజులు ఏకధాటిగా హౌజ్-ఫుల్ బోర్డులతో సినిమా నడిచింది.
14) ఇప్పటికి సికింద్రాబాద్లోని అజంతా థియేటర్లో అడవి రాముడు నెలకొలిపిన 161 రోజుల రికార్డుని యే సినిమా బద్దలుకొట్టలేదు.